కేంద్రమంత్రి గడ్కరీ, నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే సందర్భంలో చంద్రబాబు పోలవరంతో పాటు, విజయవాడలో నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ పై కూడా నితిన్ గడ్కరీకి నివేదించారు. మాటలతో చెప్పటమే కాకుండా, లేఖ రూపంలో కూడా, ఫ్లై ఓవర్ విషయంలో ఎదురవతున్న ఇబ్బందులను గడ్కరీ ముందు ఉంచారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పనులను పూర్తి చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ గడువు పొడిగించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు. ఫ్లై ఓవర్‌ నిర్మిస్తున్న ప్రాంత పరిస్థితులు, భద్రత దృష్ట్యా ప్రాజెక్టులో ప్రతిపాదించిన డిజైన్ మార్పులు కూడా ఇంకా ఆమోదం చెప్పలేదని, అవి కూడా త్వరగా ఆమోదించాలని కోరారు. అలాగే నిధులు విషయంలో కూడా, జాప్యం జరుగుతుందని, త్వరగా నిధులు విడుదల చెయ్యలని కోరారు.

flyover 12072018 2

ప్రాజెక్ట్ ఖర్చులో పెట్టాల్సిన దానికంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పెట్టింది అని, త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని రకాల మద్దతు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, కేంద్రం కూడా సహకరించాలని కోరారు. ఒక పక్క నిధులు ఇవ్వక, మరో పక్క డిజైన్ లు ఆమోదం లభించక, ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుందని అన్నారు. కృష్ణా తూర్పు కాల్వ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు చేపట్టవలసిన అప్రోచ్‌ పోర్షన్‌ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.19.07 కోట్ల నిధులను రాష్ట్రాభివృద్ధి పథకం కింద కేటాయించిందని, ఆ డబ్బులు రాష్ట్రానికి ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్చి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు వెచ్చించినా కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు.

flyover 12072018 3

ఫ్లై ఓవర్ నిర్మాణం వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని సోమా కనస్ట్రక్షన్‌ సంస్థ ఎండీ హామీ ఇచ్చారు. వచ్చేఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీనికి జనవరి 26కు అవకాశం ఇవ్వాలని ఎండీ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం 70శాతం పనులు పూర్తయ్యాయి. 62 శాతం బిల్లులు చెల్లించారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రితో ఇబ్బందులు చెప్పటం, లేఖ కూడా రాయటంతో, ఇప్పటికైనా ఈ ఫ్లై ఓవర్ కు ఇబ్బందులు తొలగి, త్వరతిగతిన పూర్తవుతుందని ఆశిద్దాం...

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం డీపీఆర్ 1లో ఇంకా రూ.400 కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇవ్వాలని చెప్పారు. డీపీఆర్ 2 ఇచ్చి ఏడాది దాటినా కొర్రీలు వేస్తూ ఇప్పటికీ ఆమోదం తెలపలేదని ఆయన మండిపడ్డారు. కొన్ని అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారని చెప్పారు. కొన్ని శాఖలకు సంబంధించి సమాధానం కావాలని చెప్పారన్నారు. ఢిల్లీకి అధికారులను పంపుతామని, మొత్తం సమాచారం ఇస్తామని గడ్కరీకి చెప్పానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ అంశం పైన అయినా అధికారులను పంపిస్తామని, అవసరమైతే తానే ఢిల్లీకి వస్తానని గడ్కరీకి తాను స్పష్టం చేశానని చంద్రబాబు చెప్పారు.

cbn sec 12072018 2

కావాలంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్నే ఢిల్లీకి తీసుకు వస్తానని కేంద్రమంత్రికి చెప్పానని అన్నారు. ఏ సమాచారం కావాలన్నా మొత్తం ఇస్తామని గడ్కరీకి స్పష్టం చేశామని చంద్రబాబు అన్నారు. అక్కడ భూమి విలువ పెరిగిందని ఆయనకు తెలిపానని అన్నారు. ఏపీ బీజేపీ నేతలు, వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, కొన్ని శక్తులు అభివృద్ధికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని గడ్కరీకి చెప్పానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావొద్దని, కొన్ని వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయని గడ్కరీకి చెప్పానని అన్నారు. ఎవరో ఆరోపణలు చేస్తే దానిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం సరికాదని కేంద్రమంత్రికి చెప్పానని అన్నారు. కొందరి మాటలు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని చెప్పానని అన్నారు..

cbn sec 12072018 3

‘‘గతంలో కేవలం పట్టా భూములకు మాత్రమే పరిహారం లెక్కించారు. ఆ తర్వాత 2013 చట్టంలో అసైన్డు భూములకు కూడా పరిహారం ఇవ్వాలని తేల్చారు. ఆ కారణంగా పరిహారం చెల్లించే భూమి పెరిగింది. మరో వైపు గతంలో కొంత మేర గోడ నిర్మించి ముంపు నివారించవచ్చని భావించారు. ఆ తర్వాత నిపుణుల కమిటీలు గోడతో సాధ్యం కాదని తేల్చి మరికొన్ని గ్రామాలను ముంపులో చేరేవిగా గుర్తించారు. దీని వల్లా భూమి పెరిగింది’’ అని చంద్రబాబు అన్నారు. ముంపులో చిక్కుకునే భూమి పెరగలేదని, పరిహారం చెల్లించాల్సిన భూమి మాత్రమే పెరిగిందని అదీ 67 వేల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు పెరిగిందని అన్నారు. పోలవరం ముంపు వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో 371 ఆవాసాలు తరలించాల్సి వస్తోందని, అందువల్లే భూసేకరణ పునరావాస వ్యయం రూ.30 వేల కోట్లు దాటిందని ముఖ్యమంత్రి చెప్పారు.

మాది నీతివంతమైన పాలన..పారదర్శకత ఉంది.. అందుకే పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. గత నాలుగేళ్ల క్రితం వరకూ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలేమిటో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. బుధవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వోక్స్ వ్యాగన్ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకువస్తే కమీషన్లకు కక్కుర్తిపడి బలిపశువును చేయటంతో గుజరాత్ కు తరలివెళ్లిందన్నారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా పారదర్శకంగా అనుమతులు మంజూరు చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.

cbn 12072018 2

ప్రపంచమంతా ఏపీ సర్కార్ నిర్ణయాలను స్వాగతిస్తుంటే ప్రతిపక్షనేత మాత్రం రోడ్డెక్కి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు రానివ్వకుండా అభివృద్ధి పనుల్లో నిధులు కాజేసిన కారణంగానే వైఎస్ పాలనలో ఏపీ ఇమేజి డామేజీ అయిందన్నారు. జగన్ నిర్వాకంతో ఐఏఎస్ అధికారులు సైతం జైలుపాలయ్యారన్నారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతారు..వాట్ నాన్సెన్స్.. అధికారులను బెదిరిస్తారు. అలాంటి వారా మామీద ఆరోపణలు చేసేదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా FDIల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలోని మొదటి అంశమే అవినీతికి ఆస్కారం ఇవ్వరాదని ఉందని, ఆ భరోసాతోనే పరిశ్రమను స్థాపించార న్నారు.

cbn 12072018 3

వోక్స్ వ్యాగన్ వస్తే రాష్ట్రం ఎప్పుడో ఆటోమొబైల్ హబ్ గా మారేదన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రానికి కియాతో పాటు ఇసుజు, అపోలో టైర్స్, భారత్ లేలాండ్ వంటి సంస్థల ఏర్పాటుకు కృషి చేశామన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పెను మార్పులతో పెట్టుబడి దారులతో పాటు పేద వర్గాల్లో విశ్వసనీయత పెంపొందించ గలిగామని స్పష్టంచేశారు. కాగా తన సింగపూర్‌ పర్యటన సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేందుకు చేసిన ప్రయత్నంలో ప్రపంచ నగరాల సదస్సు వేదిక పై సఫలమయ్యామని చెప్పారు. ఇప్పటివరకు తాను ఆరు బిజినెస్‌ పెట్టుబడుల సదస్సులను నిర్వహించానని, నవ్యాంధ్ర ఏర్పడిన అనంతరం మూడు సదస్సులను నిర్వహించామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని యూనివర్సిటీలలో, యాత్ర చెయ్యటానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారు. వర్శిటీలో ఒక్కొక్క రోజున నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తాను పాల్గొని 10 వేల మంది విద్యార్థులతో నేరుగా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పారు. పాల్గొనే విద్యార్థులను వివిధ పోటీల ద్వారా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం, అమరావతి, ఇస్రో ప్రగతి, ఐటీ-ఐవోటీ, స్టార్టప్స్ వంటి అంశాలపై విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించాలని చెప్పారు. ఆయా విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు కనుగొన్న నవీన ఆవిష్కరణలు, అవలంభిస్తున్న వినూత్న అభ్యాసాలపై అక్కడే ఒక ఎగ్జిబిషన్ నిర్వహించాలని కోరారు.

cbn university 12072018 2

సీఐఐ సహా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఆరోజు ఉదయం నుంచి వర్క్‌షాప్ నిర్వహించాలని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్, వాల్ మార్ట్, అలీబాబా, టాటా, మహీంద్రా, ముఖేశ్ అంబానీ వంటి ప్రముఖుల్ని ఆహ్వానించి వారి ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే నవతరానికి స్పూర్తినందించాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ద్వారా యువతలో శక్తిని నింపి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ, సమన్వయ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యామండలి, ఆయా వర్శిటీలే దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని నిర్దేశించారు.

cbn university 12072018 3

ప్రతిభా పురస్కార విజేతలు, కళాశాల, వర్శిటీ టాపర్లు, ‘చంద్రన్న ఉద్యోగ మేళ’లో కొలువులు సాధించిన యువతీ యువకులు, నవ్యావిష్కరణలతో రోల్‌మోడల్‌గా నిలిచిన విద్యార్థులు, క్రీడా, సాంస్కృతిక రంగాలలో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ ఒకదాన్ని రెండు, మూడు రోజులలో ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్లన్నీ ఈ యాప్ ద్వారా జరుగుతాయని తెలిపారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఈనెల 18న శ్రీకాకుళం డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2న విజయనగరం జెఎన్‌టీయూలో, ఆగస్టు 17న విశాఖ ఏయూలో, ఆగస్టు 31న పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ హార్టీకల్చరల్ యూనివర్శిటీలో, సెప్టెంబరు 14న రాజమహేంద్రిలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబరు 30న మచిలీపట్నం కృష్ణా వర్శిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీలకు కలిపి, అక్టోబరు 12న గుంటూరు నాగార్జున, ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయాలకు కలిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మిగిలిన విశ్వవిద్యాలయాల్లో కూడా వరుసగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవసరాన్ని బట్టి నిర్ణిత తేదీలలో మార్పులు జరుపుతారు.

Advertisements

Latest Articles

Most Read