జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని సబ్బం హరి పేర్కొన్నారు. వివాదాలు సృష్టించడానికే పవన్ మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. టీటీడీలో పింక్ డైమండ్ లేదని మాజీ ఈవోలంతా నిర్ధారించారని గుర్తు చేశారు. అయినా పవన్ పదేపదే అదే విషయాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ ఎరైవల్ బ్లాక్ లో ఉంటే, డిపాచర్ అవుతున్న ఒక ఐఏఎస్ వచ్చి నాతో చెప్పారు అంటుంటేనే, పవన్ కధలు చెప్తున్నాడని అర్ధమవుతుందని, ప్రపంచంలో ఎంత అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో అయినా, చిన్న ఎయిర్ పోర్ట్ లో అయినా, ఎరైవల్ బ్లాక్, డిపాచర్ బ్లాక్ వేరు వేరుగా ఉంటాయని, ఆ మాత్రం కూడా తెలియకుండా, పవన్ కధ అల్లడని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్న వ్యాఖ్యలు కూడా అవగాహన రాహిత్యంతో కూడుకున్నవేనన్నారు. తనవల్లే అశోక్ గజపతి రాజు గెలిచారని, తన వల్లే టీడీపీ అధికారం అనుభవిస్తోందన్న పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని తెలిపారు. ‘‘1983 నుంచి ఇప్పటిదాకా అశోక్ గజపతి రాజు ప్రతి ఎన్నికలో గెలుస్తున్నారు. 30 ఏళ్లుగా గజపతులు అనుభవించిన పదవులు ఎవరి దయతో వచ్చాయో చెప్పాలి. 1983లో ఆయన గెలిచినప్పుడు పవన్ స్కూల్‌లో ఉండి ఉంటారు. తనవల్లే అశోక్‌గజపతిరాజు పదవులను అనుభవిస్తున్నారన్న మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అక్కడ పవన్‌పై వ్యతిరేకత వచ్చింది’’ అని పేర్కొన్నారు.
‘జగన్, పవన్ బీజేపీ డైరెక్షన్‌లోనే పని చేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా బీజేపీని వారు నిలదీస్తారని ఆశించడం అనవసరం. కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే వారి లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేయవచ్చు’’ అని అన్నారు. ‘‘భవిష్యత్తు అవసరాల కోసం ఏపీలో బీజేపీ రాజకీయ క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే పవన్, జగన్ ఆడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైసీపీ కలవదు. పవన్, జగన్ కలిసి పోటీ చేసి... ఎన్నికల అనంతరం బీజేపీకి మద్దతు ఇస్తారు. అందుకు అనుగుణమైన వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుంది’’ అని సబ్బం హరి పేర్కొన్నారు.