వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మాజీ ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలను వెనుకుండి బీజేపీ నడిపిస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయాలు నడిపిందో, ఈరోజున ఏపీలో బీజేపీ అలాంటి రాజకీయ క్రీడ నడపబోతోందనే విషయం రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.

pk jagan 05072018 2

ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ, ‘ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనం. టీడీపీ, చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు. ‘పవన్ కల్యాణ్ గారు మా పార్టీకి మద్దతిస్తానని నాకే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తో కలిసి పవన్ కలిసి పనిచేస్తారు’ అని తిరుపతి వైసీపీ ఎంపీ వరప్రసాద్ గారు ఈ మధ్య ఓ ప్రకటన చేశారు కదా!’ అని చెప్పుకొచ్చారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత ఏపీలో బీజేపీకి చాలా వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు వాదనను ప్రజలందరూ అంగీకరించారని చెప్పారు. అదే సమయంలో, బీజేపీని, మోదీని వైసీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించకపోవడాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు.

pk jagan 05072018 3

వివాదాలు సృష్టించడానికే పవన్‌ మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. వైఎస్‌ హయాంలో పనిచేసిన ఈవోలు, అప్పట్లో చంద్రబాబుతో పనిచేసిన ఈవోలంతా తిరుమలలో పింక్‌ డైమండ్‌ లేదని చెప్పారని అయన గుర్తు చేశారు. పవన్‌ పదేపదే అదే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను గెలిపించడం వల్లే అశోక్‌గజపతి గెలిచారని పవన్‌ అన్నారని, వాళ్లు అనుభవిస్తున్నవన్నీ తన దయే అన్నట్టు పవన్‌ మాట్లాడారని సబ్బంహరి గుర్తుచేశారు. అలా మాట్లాడినందుకే పవన్‌పై ఉత్తరాంధ్రలో తీవ్రవ్యతిరేకత వస్తుందని చెప్పారు. 1983 నుంచి 2014 వరకు అశోక్‌గజపతిరాజు గెలుస్తూ వస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా అశోక్‌గజపతిరాజును పవనే గెలిపించారా? అని ప్రశ్నించారు. టీడీపీలో క్రమశిక్షణ గల సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు అని సబ్బంహరి స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ కూడా రోజు రోజుకీ జగన్ లా తయారు అవుతున్నాడు... నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దీంతో పవన్ కు ఘాటు రిప్లై ఇచ్చారు టిడిపి నేత. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సవాల్ చేశారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముదపాక భూముల విషయంపై...పవన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తాను రూ. 100 కోట్లు కూడబెట్టానని పవన్‌ ఆరోపించారని, తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తిని అమ్ముకున్నానేతప్ప కూడబెట్టలేదని అన్నారు. ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి అక్రమంగా కూడబెట్టానని పవన్ నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే పవన్ క్షమాపణ చెప్పాలని బండారు సవాల్‌ విసిరారు.

pk bandaru 05072018 2

బీజేపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నారని బండారు విమర్శించారు. 900 ఎకరాలు ఆక్రమించామని తమపై అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను తిట్టాలని, జగన్‌ను తిట్టొద్దని బీజేపీ చెప్పిందా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజాసేవ చేస్తానని వచ్చి... తనను చంపేస్తానని బెదిరిస్తారా? అంటూ బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. ఫార్మాసిటీలో కాలుష్య పరిశ్రమలు తాను తెచ్చానని పవన్‌ అన్నారని, కానీ వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుమతులు వచ్చాయని ఈ సందర్భంగా బండారు గుర్తుచేశారు. తనపై ఆరోపణలు నిరూపితమైతే మీ జనసేన చెప్పినట్లుగా తనని చంపేయాలని బండారు అన్నారు. తాను ప్రాణాలకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే వారు తనను ఆదరిస్తున్నారని చెప్పారు.

pk bandaru 05072018 3

నిజంగా, వందలాది ఎకరాల భూములను తాను ఆక్రమిస్తే ఈ పాటికి మీడియా తనను బయటపెట్టేదన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌తో జనసేనాని మాట్లాడుతున్నారని ఆరోపించారు.వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తాను కూడా చాలా విషయాలు మాట్లాడగలనని, ఈ విషయం పవన్ గుర్తుంచుకోవాలని బండారు హెచ్చరించారు. పవన్ కొత్తగా రాజకీయాలు నేర్చుకున్నారని, తాను చిన్నప్పటి నుంచి రాజకీయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని, ఇప్పటి వరకు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. తనను ఇప్పటి వరకు ఎవరూ వేలెత్తి చూపలేదన్నారు. నేను, నా కొడుకు కలిసి వందకోట్ల ఆస్తి సంపాదించామని పవన్ ఆరోపించారని మండిపడ్డారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రశ్నించేందుకే జనసేన అన్న పవన్.. రాష్ట్రానికి నష్టకరంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌ గురించి ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం పవన్‌కల్యాణ్‌ చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక వైపు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తుంటే మరో వైపు వైకాపా, జనసేన పార్టీలు కేంద్రంలోని భాజపాతో కలిసి లాలూచీ రాజకీయలు చేస్తున్నాయని ఆరోపించారు.

pk 05072018 2

ఈసందర్భంగా పవన్‌కు కొన్ని ప్రశ్నలు మంత్రి సంధించారు. ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్‌ను కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని.. ఆ బిల్లును కేంద్రం ఆమోదించకుండా నానబెడుతుంటే మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విభజన హామీలను మొత్తం చేసేశామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తే పవన్‌ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ఉత్తరాంధ్రకు ఇచ్చిన రూ.150 కోట్లు ప్రధాని వెనక్కి లాగేసుకున్నా.. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు నాలుగేళ్లు అయినా ఇవ్వకపోయినా.. పవన్‌ ఎందుకు మోదీని విమర్శించరని ప్రశ్నించారు.

pk 05072018 3

విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు తగు సాయం ఇవ్వన్ని కేంద్రాన్ని పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై పవన్‌ తన వైఖరిని ఎందుకు ఇంత వరకు తెలియజేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైల్వేజోన్‌ కోసం తెదేపా ఎంపీలు దీక్ష చేపడితే కనీసం సంఘీభావం తెలపకుండా విమర్శలకు దిగటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటూ పలు ప్రశ్నలు సందించారు. పవన్‌, జగన్‌, మోదీతో కుమ్మక్కులో భాగమే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.

ఏపీకి అన్ని ఇచ్చేశామని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తాజాగా ప్రాజెక్టుల విషయంలో దాటవేత దోరణి అవలంభించింది. సుప్రీం కోర్టుకు కేంద్ర ఆర్థిక శాఖ జలవనరుల శాఖ అందించిన అఫిడవిట్‌లో ఎక్కడ ప్రాజెక్టులపై స్పష్టమైన సమాచారాన్ని పొందుపరచలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన కేంద్రజలవనరుల శాఖ 47 పేజీల అఫిడవిట్‌లో వివరాలు పూర్తిగా దాచిపెట్టి.. కొన్ని విషయాలను మాత్రమే పొందిపరిచింది. పోలవరంపై పూర్తిగా స్పష్టత లోపించింది. నీటిపారుదల విభాగం వరకే నిధులు ఇస్తామని కేంద్రం తెలిపింది. కృష్ణా, గోదావరి బోర్డుల విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పలేదు. నీటి కేటాయింపులు, జలవివాదాల పరిష్కారంపై స్పందించలేదు.

polavaram 05072018 2

విభజన చట్టంలో ప్రధాన అంశాలపై కేంద్రం దాటవేత ధోరణి ప్రదర్శించింది. పోలవరం భూసేకరణ, పునరావాసం అంశాలను పట్టించుకోలేదు. జలవనరుల శాఖ ఎస్టీ కమిషన్‌ సిఫారసుల ప్రస్తావనే చేయలేదు. పోలవరం, నీటి పంపకాలు, జల వివాదాలపై అరకొర సమాచారంతో సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. మరో పక్క, ఈ విషయం పై యనమల స్పందించారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించేదిగా ఉందని ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. తొలి ఏడాది ఆర్ధికలోటుపై అరుణ్ జైట్లీ చెప్పిన ఫార్ములా గురించి అఫిడవిట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో ఆర్ అండ్ ఆర్ గురించి స్పష్టత ఇవ్వలేదన్నారు. పునరావాస ప్యాకేజీ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

polavaram 05072018 3

14వ ఆర్ధిక సంఘం 42% వాటా ఇచ్చింది కాబట్టి ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇస్తామని చెప్పింది ఏమిటి..? అఫిడవిట్‌ కేంద్రం పేర్కొన్నదేమిటని దుయ్యబట్టారు. చట్టంలో చెప్పిన దానికి, అఫిడవిట్‌లో పెట్టినదానికి ఏమీ పొంతన లేదన్నారు. ఏపీకి ఇంకా రావాల్సింది ఏమిటని అని తెదేపా డిమాండ్ చేస్తోందో, అవన్నీ ఇచ్చేశామని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రజలనే కాదు న్యాయస్థానాలను కూడా పక్కదారి పట్టించడమేనని యనమల అన్నారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు వ్యతిరేకంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని యనమల స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read