కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కూడా చేస్తోందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. గురువారం రాత్రి ఇక్కడ గుంటూరు జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభకు కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామంటే మనకు అభ్యంతరం లేదని, అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు జరుపుతామంటే అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. 'షెడ్యూల్ ప్రకారమే మన శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలి. జమిలి ఎన్నికల పేరుతో లోక్‌సభతోపాటే మన అసెంబ్లీకి కూడా అక్టోబరు, నవంబరుల్లో ఎన్నికలు పెట్టాలని కేంద్రం చూస్తోంది. అవసరమైతే న్యాయనిపుణులతో మాట్లాడి న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తాం’ అని స్పష్టం చేశారు
గుంటూరులో నిర్వహించనున్న ముస్లిం మైనారిటీల సభకు ముందే... రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు కల్పించాలని జిల్లా నాయకులు సూచించగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గడచిన నాలుగున్నరేళ్లలో ఏం చేశామో గ్రామాలు, వార్డుల వారీగా వివరిస్తామని, రాబోయే ఐదేళ్లలో మనం చేసే అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలను ప్రజల ముందుంచి, అన్ని వర్గాల మద్దతు పొందుదామని ఆయన తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆరు నెలల పాటు గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాల్ని ఒక పండుగలా నిర్వహించాలన్నారు. ఆరు నెలల్లో 75 సభలు జరుపుతామని వాటిలో 25 రైతు సభలు, 25 మహిళా సభలు, 25 సంక్షేమ సభలు నిర్వహిస్తామన్నారు. నాలుగేళ్లలో మనం చేసిన పనులకు పుష్కలంగా ఓట్లు పడతాయన్న నమ్మకముందని, ఎక్కడైనా నాయకులు నష్టం చేస్తే తప్ప ఓట్లు తగ్గే ప్రసక్తి లేదన్నారు.
1100కి ఫోన్ చేసి విజ్ఞప్తి చేసినవారికి నేరుగా పింఛన్లు మంజూరు చేయడం వల్ల, విపక్ష పార్టీలకు చెందినవారికీ లబ్ధి చేకూరిందని కొందరు నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దానిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే అందర్నీ సమానంగా చూడాలని, తాను 175 నియోజకవర్గాల్ని సమానంగా చూస్తున్నానని తెలిపారు. ‘కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడా కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. దానిని సరిదిద్దుకోవాలి. మీ పొరపాట్లకు పార్టీ నష్టపోకూడదు.నేను కార్యకర్తల మనిషిని’ అని అన్నారు. రాజధాని జిల్లా అయిన గుంటూరులో ప్రజల అంచనాలు కొంత అధికంగా ఉంటాయని, ఆ స్థాయికి నాయకులు ఎదగాలన్నారు.