రైతు కుటుంబాలను ఆదుకోవడానికే చంద్రన్న బీమా తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రావికంటిపేటలోజరిగిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగ్గుశాస్త్రులపేట సమీపంలోని ఎన్టీఆర్ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈనెల నుంచి రైతు బీమాను ప్రారంభిస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల బీమా, పాక్షిక అంగవైకల్యానికి రూ.2 లక్షలు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రైతుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామన్నారు.
రైతు ఆనందంగా ఉంటే సమాజం ఆనందంగా ఉంటుందన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటికొరతను అధిగమిస్తున్నామన్నారు. రైతు కూలీలకు న్యాయం జరగాలని, వారికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు పెట్టుకోవాలని సూచించారు. వ్యవసాయంలో కొత్త మెళకువలు తెలుసుకోవడంతో పాటు రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రూ.5లక్షల మొత్తాన్ని బాధిత రైతు కుటుంబానికి అందజేసే ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రైతు లేకపోతే తిండిలేదు.. అలాంటి రైతులు చేసే వ్యవసాయానికి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.
2004-2014 మధ్య కాలం ఓ భయంకరమైనదని అభివర్ణించారు. ఆ కాలంలో విత్తనాలు, ఎరువులు దొరికేవి కాదని విమర్శించారు. ఒక్కో రైతుకు రెండు లాఠీ దెబ్బలు, ఒక్క ఎరువు బస్తా దొరికేదని గుర్తుచేశారు. ఆ రోజులను రైతులు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కల్తీ విత్తనాల సమస్య ఉండేదని.. ఆ సమయంలో అన్నీ సమస్యలేనన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు విద్యుత్‌కొరత లేదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక రైతులకు రూ.24వేల కోట్ల మేర రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగానికి రూ.82వేల కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు. సాంకేతికతను అనుసంధానం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని, శాస్త్రీయ వ్యవసాయం చేయాలని, యాంత్రీకరణపై దృష్టి పెట్తాలని చంద్రబాబు రైతులకు సూచించారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గాలన్నారు. నదుల అనుసంధానం పూర్తిచేసి నీటి కొరతను అధిగమించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు.