చంద్రన్న భీమా పధకం వల్ల అనాధ శవంగా పడి ఉన్న అతన్ని, కుటుంబం వచ్చి దహన సంస్కారాలు చేసిన సంఘటన చుస్తే, ఒక పక్క మానవత్వం కంటే, డబ్బు గొప్పది అనే సందేశం వస్తున్నా, ఆ డబ్బు కోసమైనా, ఆనాధ శవంగా కాకుండా, కుటుంబ సభ్యులు దహనం చేసారు అనే ఆనందం అన్నా వస్తుంది.. వివరాల్లోకి వెళ్తే, అల్లు సత్యనారాయణ అనే వ్యక్తి, విశాఖ జిల్లా పాయకరావుపేట పంచాయతీకి చెందిన వ్యక్తి. ఈయన లారీ డ్రైవర్. శరీరంలో ఓపిక ఉన్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని భార్యా పిల్లలను పోషించాడు. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచాన పడ్డాడు. తన భార్య ఉన్నంతవరకు ఆయన బాగోగులు చూసుకునేది. ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ఇద్దరు కుమారులు పట్టించుకోవడం మానేశారు.
దీంతో కొద్ది రోజులుగా స్థానిక ఆర్టీసీ బస్టాండులో కాలం వెల్లదీస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు, పోలీసులు కుటుంబ సభ్యులకు చెబితే మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు. ఇంతలో ఎవరో మృతుడికి చంద్రన్న బీమా వస్తుందని చెప్పడంతో వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఈ సంఘటన చూసిన పలువురు తీవ్ర ఆవేదన చెందారు. మానవత్వం నశించిన చోట చంద్రన్న బీమా ఆదుకుందని విచారం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై చంద్రన్న బీమా సిబ్బంది కుమా రిని వివరణ కోరగా బుధవారం ఆర్టీసీ బస్టాండులో అల్లు సత్యనారాయణ అనే వ్యక్తి చనిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు. పరిశీలించి వివరాలు నమోదు చేస్తామని ఆమె తెలిపారు.
ఇదీ పధకం... దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అసంఘటిత రంగ కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన వరం చంద్రన్న భీమా... అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా సహజమరణానికి గురైతే వారి కుటుంబానికి రూ.2 లక్షలు, ప్రమాదం జరిగి మరణిస్తే 5 లక్షల చొప్పున చంద్రన్న బీమాపథకం కింద లబ్ధి చేకూరింది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న అసంఘటిత రంగ కార్మికులు ఆధార్, బ్యాంక్‌ఖాతా, రేషన్‌కార్డుతోపాటు రూ. 15 చెల్లించి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ ఖాతాలేని వారికి వాటిని సమకూర్చి బీమా పథకం కింద బీమా మిత్ర నమోదు చేస్తారు. బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం కింద జూన్, జులై మాసాల్లో పేర్లు నమోదు చేస్తారు.