నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా.. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అంటూ ఎదురుచూసిన అభ్యర్థులకు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ రోజు డీఎస్సీ ప్రకటన చేశారు. 10,351 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జులై 7న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జూలై 7 నుంచి ఆగస్టు 9వరకు డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో డీఎస్సీ నిర్వహణ ఉంటుందని, ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని యోచిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంటుదని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటలకు వరకు అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 10న ఫైనల్ కీని విడుదల చేస్తామని, అలాగే సెప్టెంబర్ 15న ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆరు కేటరగిల్లో డీఎస్సీ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు.
మరోవైపు ఏపీ టెట్ షెడ్యూల్ కూడా మంత్రి విడుదల చేశారు. మే 4న టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 5 నుంచి మే 22 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ఉండనుంది. అలాగే జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. జూన్ 10 నుంచి 21వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. జూన్ 28న ఫైనల్ కీ, జూన్ 30న పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.