వేళ్లూనుకుపోయిన వ్యవస్థలో ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో మార్పు రావడం సాధ్యంకాదు. సమాజంలోని అన్ని వర్గాల్లోనూ, ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో నూ అవినీతి పేరుకుపోయింది. ఇటువంటి అవినీతిని నిర్మూలించడానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్లాలి. వ్యవస్థలో సమూలంగా మార్పు తీసుకురావడానికి, అవినీతి అంతమొందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుంబిగించారు. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. అవినీతి నిరోధానికి, జవాబుదారీ, పారదర్శక పాలనకు టెక్నాలజీని సోపానంగా మలుచుకుంటున్నారు.
దాపరికం లేని పాలన, పేదరికం లేని సమాజం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాహితమైన, అవినీతి రహితమైన పాలనే ప్రభుత్వ విధానం. ఇందుకు ఎంచుకున్న మార్గం జవాబుదారీతనం. పారదర్శకత, ఇందులో భాగంగా తాజాగా ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన కార్యక్రమమే "ప్రజలే ముందు". వ్యవస్థలో ప్రజలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఏ కార్యక్రమం ఆరంభించినా ప్రజలే ముందు అనే స్పూర్తితో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనం. ప్రభుత్వం ప్రజలకు చేరువగా వెళ్లి వారిని గౌరవించి, అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా మొదటగా విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో ఈ కాల్ సెంటర్ ప్రారంభించింది. ఏ స్థాయిలో అవినీతి ఉన్నా 1100 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే సత్వరం చర్యలు మొదలవుతాయి.
గత సంవత్సరం సీఎం అమెరికా పర్యటనలో రోచెస్టర్ లోని మయో ఆస్పత్రి స్ఫూర్తితో ప్రజలే ముందు అనే కార్యక్రమం మొదలుపెట్టారు. మయో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న దేవేంద్ర గౌడ్ ను పరామర్శించడానికి సీఎం అక్కడకు వెళ్లారు. ఆ సందర్భంలో అక్కడ సేవ చేసే విధానం, రోగులకు ఇచ్చే ప్రాధాన్యత, పరిస్థితులను గమనించారు. అక్కడ అందించే వైద్యం, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రోగుల పట్ల ప్రవర్తించే తీరు అతనిని బాగా ఆకట్టుకుంది. ప్రపంచంలో అతిపెద్ద ఉత్తమమైన ప్రైవేటు ఆసుపత్రి రోచెస్టర్‌లోని మయో ఆస్పత్రి. "పేషెంట్ ఫస్ట్" అనే ఉన్నత ఆశయంతో పనిచేస్తున్న ఈ సంస్థ వైద్యసేవలతో పాటు వైద్యరంగంలో విస్తృత పరిశోధనలు కూడా నిర్వహిస్తోంది. అక్కడి క్రమశిక్షణ చూసి సియం ముగ్ధుడు అయ్యారు... మయోలో రోగులకు ఇచ్చే ప్రాధాన్యతను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ ఫస్ట్ (ప్రజలే ముందు) అనే నినాదాన్ని తీసుకువచ్చింది... 1100టోల్‌ఫ్రీ నెంబర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది...