ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఈ రోజు పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమాన్ని అణిచి వేయటానికి, ప్రభుత్వం వారం రోజుల ముందు నుంచి ప్లాన్ చేస్తూ వస్తుంది. ఉద్యోగులను అణిచివేయటం చాలా తేలికగా ప్రభుత్వం భావించింది. అందుకే వారితో ఎక్కడా ఈ చలో విజయవాడ కార్యక్రమం చేయకుండా ఆపే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా తమ పోలీస్ ఫోర్సు తో వారిని ఆపి వేయొచ్చు అని అనుకున్నారు. అలాగే ఉద్యోగులను ప్రజల్లో దోషులుగా చూపించ వచ్చని ప్లాన్ చేసారు. అయితే సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ అంచనా తప్పింది. ఒకేసారి వేల మంది, లక్షల మంది విజయవాడ రోడ్ల పైకి వచ్చేసారు. ఇంత నిర్బంధం చేసినా ఎలా వచ్చారో ప్రభుత్వానికి అర్ధం కాలేదు. నిన్నటి నుంచి మొత్తం నిర్బంధం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉదయం 9 గంటల వరకు కూడా అందరూ అదే అనుకున్నారు. కానీ ఒకేసారి ఒక సునామీ లాగా వచ్చేసారు. దీంతో పోలీసులు పూర్తిగా వదిలేసారు. ఎక్కడా పోలీసులు ఉద్యోగులను ఆపినట్టు కూడా వీడియోలు లేవు. ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గున్నారు. వేలు, లక్షలు అయ్యాయి. విజయవాడ సందులు అన్నీ నిండి పోయాయి. దీంతో ప్రభుత్వానికి షాక్ తగిలింది. వెంటనే మీటింగ్ కు పిలిచారు.
జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమైన నాయకులను పిలిపించారు. అయితే ఆ మీటింగ్ లో, ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం పోలీసుల వైఖరి వల్లే, ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున వచ్చారని, పోలీసులు ఎక్కడా నిలువరించే ప్రయత్నం చేయలేదని, చూసి చూడనట్టు వదిలేసారని, ప్రభుత్వ పెద్దలు ఒక అంచనాకు వచ్చారు. మరీ ముఖ్యంగా పోలీసుల జీతాలు కూడా తగ్గి పోయాయి. పోలీసులు బయటకు వచ్చి ఆందోళన చేసే అవకాసం వారికి ఉండదు, అందుకే ఉద్యోగుల ఉద్యమానికి కింద స్థాయి పోలీసులు మద్దతు తెలపబట్టే, ఇది సాధ్యం అయ్యిందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అదీ కాక అనధికారికంగా పోలీస్ శాఖ, సజ్జల ఆధీనంలో ఉంటుంది. సజ్జల పైన పోలీసులకు ముందు నుంచి అసహనం ఉందని, అది ఈ సందర్భంలో బయట పెట్టి ఉంటారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే, రాజకీయంగా కూడా ఇబ్బంది అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.