సైబర్ సెక్యూరిటీ కోసం నిర్దే శించిన బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి అంతర్జాతీయ సదస్సును విశాఖలో ఈ నెల తొమ్మిది, పది తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ఐటి సలహాదారు జె.ఎ.చౌదరి తెలియ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఫిన్టెక్ వ్యాలీగా విశాఖకు ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు రెండు రోజుల పాటు ఇక్కడ జరిగే బ్లాక్ చైన్ టెక్నాలజీ సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు.
ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయని, మన దేశంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విరివిగా వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. ప్రపంచంలోని అమెరికా, యుకె, స్వీడన్, ఇజ్రాయిల్ దుబాయ్ వంటి దేశాలు ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటోందని అన్నారు.
డిజిటల్ ఇండియా వచ్చిన తరువాత సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టడానికి ప్రపంచ దేశాల మందున్నది బ్లాక్ చైన్ టెక్నాలజీయేనని చౌదరి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని లేని విధంగా మన రాష్ట్రంలో ఈ టెక్నాలజీని వినియోగించి, మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నది సిఎం చంద్రబాబు ఉద్దేశమని ఆయన చెప్పారు.
ఈ సదస్సుకు 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన వివరించారు. ఇప్పటికే ప్రముఖ బ్యాంకులు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ముందుకు వచ్చాయని ఆయన తెలియచేశారు. ఈ సద స్సులో పలు ఎంఓయులు జరిగే అవకాశం ఉందని చౌదరి పేర్కొన్నారు.