విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలను, తిరుపతిలో బ్రహ్మోత్సవాలను మంచి అవకాశాలుగా గుర్తించడంలో, పర్యాటక ఈవెంట్లుగా మలచడంలో మూడు ముఖ్యశాఖల అధికారులు తగిన శ్రద్ధ పెట్టలేకపోయారని ముఖ్యమంత్రి ఆవేదన వెలిబుచ్చారు. నిన్న అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు..

వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని ఊపందుకునేలా చేసేందుకు ఉపయోగించుకోవాలన్నదే తన ఆలోచనగా చెప్పారు. అమ్మవారి దర్శనార్థం విజయవాడకు వచ్చే భక్తులను మరింతగా ఆకర్షించే ఏర్పాట్లు చేసి వుండాల్సిందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కనీసం రెండు రోజులు నగరంలోని వివిధ హోటళ్లలో ‘స్టే’ చేసేలా ఉంచగలిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

నగరాలు, పట్టణ ప్రాంతాలలో ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకుని ఆర్థిక కార్యకలాపాల్లో జోరు పెంచడం అవసరం అని చెప్పారు. అదే రాష్ట్రాభివృద్ధికి సంకేతమని అన్నారు. దేవాదాయ, పర్యాటక, పురపాలక శాఖలు మూడూ మరింత సమన్వయం చేసుకుని పనిచేసి వుంటే ఫలితాలు తప్పకుండా కనిపించేవన్నారు.

పండగలు, విశేష ఉత్సవాలలో ఫుడ్ కోర్టులు, క్రాఫ్టు బజార్లు, వాణిజ్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ప్రబలంగా ఆకట్టుకుంటాయని, పర్యాటకానికి ఊతం ఇస్తాయని అన్నారు.

అమరావతిలోని నవ నగరాలలో ఆర్థిక అభివృద్ధికి తక్షణం దోహదం చేసే జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, హోటళ్ల ఏర్పాటుపై నిర్ధిష్ట లక్ష్యాలను ముందుపెట్టుకుని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. బుధవారం ఉదయం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ వారాంతపు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గున్నారు.

అమరావతిలో విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి 25 ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని, అందులో 11 జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు ఇప్పటికే తమ ప్రాతిపాదనలను పంపించాయని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. వీటిల్లో 8 సంస్థలు తొలి పది ర్యాంకులలో నిలవగా, మిగిలిన 3 విద్యాలయాలు 11 నుంచి 15 మధ్య ర్యాంకులలో ఉన్నాయని తెలిపారు.

ఇవిగాక మరో 13 సంస్థలు తమంతట తాముగా అమరావతి రావడానికి ఆసక్తి వ్యక్తీకరించాయని వివరించారు. ఒక్కొక్కటీ 5 ఎకరాలలో నెలకొల్పే 2 కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం లభించిందని చెప్పారు.

స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్, చిన్మయ మిషన్, కేండోర్ ఇంటర్నేషనల్ స్కూల్, ది హెరిటేజ్ స్కూల్, సద్భావన వరల్డ్ స్కూల్, ర్యాన్ గ్లోబల్ స్కూల్, పోడార్ స్కూల్, గ్లాండేల్ అకాడమీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జీఐఐఎస్, డీఏవీ గ్రూపు ఆప్ స్కూల్స్ ప్రతిపాదనలు పంపాయన్నారు.

ఇవిగాక, జూబ్లీ పబ్లిక్ స్కూల్, సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్, శ్రీ సరస్వతి విద్యాపీఠం, లయోలా పబ్లిక్ స్కూల్, విజ్ఞాన విహార విద్యాకేంద్రం, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, శ్రీపతి సేవా సమితి, ఎల్ కేఎస్ స్కూల్, ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూల్, అమరావతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అకాడమీ, శ్రీ గౌరీ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, సంస్కృతి గ్లోబల్ స్కూల్ మొదలైన 13 పాఠశాలలు అమరావతిలో తమ విద్యా సంస్థలను ప్రారంభించానికి సిద్దమయ్యాయని కమిషనర్ తెలిపారు.

ఆయా విద్యాసంస్థల ప్రమాణాలు, స్థితిగతులు పూర్తిగా తెలుసుకుని స్పష్టమైన అవగాహనతో తుది నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని స్పష్టంచేశారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ పోయకూడదనే నిబంధనను రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులలో అమలు చేసేందుకు తగిన కార్యాచరణ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఈ రాష్ట్రంలో ఇక తప్పనిసరి అని ఆయన స్పష్టంచేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదని బుధవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. రహదారి భద్రత కోసం వినియోగించే పరికరాల కొనుగోలుకు రూ.10 కోట్లు విడుదలచేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో ముఖ్యాంశాలు:

• రవాణా వాహనాల యజమానులు తమ డ్రైవర్లకు ‘ఇంటి దగ్గర మీకోసం ఎదురుచూసే మనుషులున్నారు జాగ్రత్త’ అని బయలుదేరే సమయలో చెప్పాలి. యజమాని చెప్పిన మాట చాలా ప్రభావం చూపుతుంది.
• నియమాలు కఠినంగా ఉన్నా తప్పని సరిగా అమలు చేస్తేనే ప్రమాదాలు నివారించగలం.
• పోలీసు, రవాణా శాఖల్లో జవాబుదారితనం మరింత పెరగాలి.


• రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై గుర్తించిన బ్లాక్ జోన్స్‌లో అసలు ఇబ్బంది ఏమిటో సత్వరమే గుర్తించి సరిచేయాలి. దీనిపై జాతీయ రహదారులు, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయం చేసుకుని సమస్యను సత్వరం పరిష్కరించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.
• ప్రమాదాలకు కారణం అవుతున్న ఓవర్ లోడ్ ఆటోలను నియంత్రించాలి.
• రహదారి భద్రత పట్ల ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి.
• నెలవారీ సమీక్షలో అధికారుల అలసత్వం తేలితే కఠిన చర్యలు తీసుకుంటా.
• ఎక్కువ శాతం ప్రమాదాలు కాపలా లేని కూడళ్లలో జరుగుతున్నాయి, అలాంటి చోట తక్షణమే కాపలా ఏర్పాటు చేయాలి.
• పట్టణ ప్రాంతాల్లో, జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించండి.
• అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్ వినియోగించుకోవాలి.
• వారంలో ఒకరోజు తప్పనిసరిగా తనిఖీలు చేయండి. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి.
• మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన శిక్షలు.
• అత్యదిక ప్రమాదాలు ద్విచక్రవాహనాల ప్రయాణాల్లోనే జరుగుతున్నాయి.
• ద్విచక్రవాహన, కారు ప్రమాదాలలో మరణాలకి కారణం హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లనే. వీటిపై ప్రజలలో కూడా మార్పు రావాలి.
• హెల్మెట్ ధరించడం ప్రభుత్వం కోసం కాదు, పోలీసులు పట్ట్టుకుంటారనే భయంతో కాదు. ప్రాణరక్షణకనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
• 15 నుంచి 34 వయసు మధ్యలో వారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం అత్యంత బాధాకరం. యువత దీనిపై సీరియస్ గా ఆలోచించాలి.
• విద్యార్దులే ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. అందుకు కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టి అక్కడికక్కడే లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేలా ప్రత్యెక కార్యక్రమం చేపట్టాం. ఒక్క విద్యార్ది కూడా లైసెన్స్ లేకుండా వాహనం నడపకుండా ఉండాలని పని చేస్తున్నాం. రవాణా శాఖ అధికారులు.
• అన్ని స్కూల్ బస్సులకు, ఇతర పాసింజర్ వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి చేయాలి.
• రాష్ట్రంలోని అన్ని వాహనాలకు జిపీయస్ అమర్చే అంశాన్ని పరిశీలించండి. జిపీయస్ వల్ల వాహనదారులకు కలిగే ప్రయోజనాలను వివరించండి.
• ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు, ట్రామాకేర్ సెంటర్ల వివరాలు వంటి అవసరమైన సమాచారం లభించేలా ఒక ప్రత్యెక యాప్ తయారు చేయండి.
• భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.
• పోలిస్, రవాణ శాఖలు సంయుక్తంగా పని చేయడం వల్లే ఇది సాద్యం అయింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ బాధ్యత ఒక్క శాఖది మాత్రమే కాదు. జిల్లా కలెక్టర్లు రహదారి భద్రత కమిటి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
• భద్రతా నియమాలు సమర్ధంగా అమలు చేయడంవల్ల విశాఖ, కర్నూల్, కృష్ణా జిల్లాలలో ప్రమాద మరణాల సంఖ్య తగ్గింది.
• ఈ జిల్లాలో చేపట్టిన ఉత్తమ పద్దతులు మిగతా జిల్లాలకు తెలియజెప్పాలి.
• రహదారి భద్రత అత్యంత ముఖ్యమైన అంశం.ఏ అధికారి అయినా సరిగా పనిచేయట్లేదని తేలితే వెంటనే తొలగించడానికి కూడా వెనుకాడవద్దు.
• ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ప్రజల్లో చైతన్యం పెంచాలి. ప్రమాద సమయంలో సాయపడే వాళ్లకి పోలీసులు ఇబ్బందులు కలిగించరన్న విషయం తెలియజేయండి. సాటివారికి సాయపడటం ప్రతిఒక్కరూ అలవాటు చేసుకోవాలి.
• ప్రమాదాల్లో వెన్నుముక దెబ్బతిని శాశ్వత వైకల్యం పొందిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి.
• రహదారుల భద్రతకు వినియోగిస్తున్న వాహనాలు, 108 వంటి వాహనాలన్నీ జియో ట్యాగింగ్ చేయండి. ప్రమాద సమాచారం దగ్గరలో ఉన్న అన్ని వాహనాలకు అందేలా ఏర్పాట్లు చేయాలి.

ప్రణాళికాబద్ధమైన పచ్చదనంతో నగరాలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ పీఎంఏవై (Ntr Pmay) గృహ నిర్మాణాలు, ‘పచ్చదనంతో పట్టణాలు, నగరాల సుందరీకరణ’ అంశాలను ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం సచివాలయంలో సమీక్షించారు. నవ్యాంధ్ర పచ్చదనంతో కొత్తశోభను సంతరించుకొనేందుకు రాజధాని అమరావతిలో బౌద్ధమాల, తిరుపతిలో వైకుంఠమాల, విశాఖలో సౌందర్యమాల పేర్లతో పచ్చదనాన్ని కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాజధాని అమరావతి, విశాఖ, తిరుపతిలలో జాతీయ రహదారులు, బాహ్యవలయ రహదారులు, నగరాలను కలిపే ప్రధాన రహదారుల చుట్టూ పచ్చదనం నింపి ఆకుపచ్చ హారంలా తీర్చిదిద్దాలని కోరారు. తిరుపతిలో వైకుంఠమాల, విశాఖలో సౌందర్యమాల, అమరావతిలో బౌద్ధమాలగా కారిడార్ల తరహాలో అభివృద్ధి చేసి పచ్చదనం తేవాలని ముఖ్యమంత్రి కోరారు. రహదారుల చుట్టుపక్కల మొక్కలు, చెట్లు నాటాలని సూచించారు.

వచ్చే మార్చిలోగా రాష్ట్రంలోని 71 పురపాలక సంఘాల పరిధిలోని కాలనీల్లో 100 ఉద్యానాలను (పార్కులను) అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వంద పార్కులను కాలనీ సంఘాలే నిర్వహించే విధంగా వారిని సిద్ధంచేయాలని, సోషల్ మెస్సేజింగ్ యాప్స్ ద్వారా హరిత సుందరీకరణ సంస్థ సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పచ్చదనంపై తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజల్ని కదిలించి భాగస్వాముల్ని చేశానని, ఇప్పుడు నవ్యాంధ్రలో పచ్చదనం, నగరాలు, పట్టణాల సుందరీకరణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, ఆనందానికి పచ్చదనంతో నగరాలను సుందరీకరించడం అనివార్యమని, ముందుకు వచ్చిన భాగస్వాములు కూడా చురుగ్గా కదిలి పనిచేయడంలేదని ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు, కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.

నగరాలు, పచ్చదనంలో కాలనీ సంఘాలను భాగస్వాములను చేయాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. విశాఖ, విజయవాడ, శ్రీకాళహస్తిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 3 కేంద్రీయ నర్సరీల ద్వారా కొత్త కొత్త ఫల, పుష్ప జాతులను ప్రజలకు పరిచయం చేయాలని, చైతన్యం తేవాలని సూచించారు. పదిరకాల పుష్పజాతుల్లో అగ్రశ్రేణిలో ఉండే 5 రకాలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 15 ప్రధాన వైద్యశాలలు, 11 విశ్వవిద్యాలయాలను పచ్చదనంతో సుందరీకరించే ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల రహదారులలో ఉన్న మధ్య తలాలను (central medians) సుందరీకరించాలని జాతీయ రహదారుల వెంట కంటికి ఇంపుగా, ఆకర్షణీయ రంగుల పుష్ప జాతుల మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. తిరుమల, అవిలాల చెరువులను ప్రాకృతిక సౌందర్యంతో తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక ఎంతవరకు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.

హైవేల పక్క మొక్కలను సొగసుగా కత్తిరించి, మొక్కలను తొలగించి వేరొక చోట నాటే కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాజధాని ప్రాంతంలో మొక్కలు నాటడం, సుందరీకరణ వేగవంతం చేయాలన్నారు.

రాష్ట్రంలో 96 అమృత్ ఉద్యానాలు (అమృత్ పార్కులు) త్వరితగతిన నిర్మాణమవుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2015-16లో రూ. 16.57 కోట్లతో 30 అమృత్ పార్కుల నిర్మాణం చేపట్టగా వచ్చే నవంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. 2016-17లో రూ. 31.22 కోట్ల వ్యయంతో చేపట్టిన 32 అమృత్ ఉద్యానాల పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరికి పూర్తిచేస్తామని వివరించారు. 2017-18లో రూ.30.98 కోట్ల వ్యయంతో 32 ఉద్యానాల రూపకల్పన పనులు పురోగతిలో ఉన్నాయని, వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి దృశ్య,శ్రవణ నివేదిక ద్వారా వివరించారు. నెల్లూరులో రూ.30 కోట్లతో చెరువు సుందరీకరణ మంజూరు దశలో ఉందని, వచ్చే ఏడాది డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తవుతాయని చెప్పారు.

శ్రీశైలం దేవాలయాన్ని రూ.2025 లక్షల వ్యయంతో, విజయవాడ కనకదుర్గ దేవాలయాన్ని రూ.2047.05 లక్షలతో, శ్రీకాళహస్తి ఆలయాన్ని రూ.1584.50 లక్షలతో, ద్వారకాతిరుమల దేవాలయాన్ని రూ.41473 లక్షలతో, అన్నవరం ఆలయాన్ని రూ.4118.30 లక్షలు, సింహాచలం ఆలయం రూ.310.00 లక్షలు, కాణిపాకం ఆలయాన్ని రూ377.25 లక్షల వ్యయంతో ( మొత్తం రూ 7177.13) సుందరీకరించే ప్రతిపాదనలను సిద్ధంచేసి అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో మొత్తం 181.09 కి.మీ మేర మధ్య తల్పాల (central medians) అభివృద్ధికి పనులు మంజూరయ్యాయి. ఇందులో 86.08 కి.మీ సివిల్ పనులున్నాయి. ఇప్పటిదాకా 69.38 కి.మీ మధ్యతల్పాల నిర్మాణం పూర్తయ్యింది.

పనులు మంజూరైన మొత్తం 181.09 కిమీలలో పచ్చికను మృదువుగా తీర్చిదిద్దడానికి (soft scaping) రూ..49.03 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.21.27 కోట్లు పచ్చికను మృదువుగా చేయడానికి, సివిల్ పనులకు రూ.27.8 కోట్లు కేటాయించారు. వచ్చే నెలాఖరులోగా ఈ పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

మొక్కలు నాటే కాలంలో రాష్ట్రమంతా 25.18 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటిదాకా 7.9 లక్షల మొక్కలు నాటడం పూర్తయ్యింది. వచ్చే అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని సీఎం సూచించారు. మొక్కల సంరక్షణకు ఒక్కో వృక్ష రక్షక కవచం కోసం రూ. 100 వంతున ధరతో 1,20,000 వృక్షరక్షక కవచాలను పంపిణీచేయాలని నిర్ణయించారు. వృక్షాలు, పుష్ప జాతులు, ఉద్యాన సేవలకు సంబంధించి మొబైల్ యాప్ ను తీసుకురానున్నట్లు ని హరిత, సుందరీకరణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. చంద్రమోహనరెడ్డి ముఖ్యమంత్రికి చెప్పారు. నగరాల్లో ప్రయోగాత్మకంగా పార్కులలో ఫిట్ నెస్ పరికరాలను ఏర్పాటుచేసి పౌరులకు మెరుగైన సదుపాయాల కల్పనకు రూ 1.98 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా కొన్ని చోట్ల ఉద్యానాల్లో ఇప్పటికే వీటిని నెలకొల్పారు. హరిత, సుందరీకరణ సంస్థ రాష్ట్రంలోని నగర పాలక, పురపాలక ప్రాంతాల్లో 650 ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. వీటిలో 156 (24%) ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 15% టెండర్ల దశలో ఉండగా, 10% పూర్తికాలేదు. 27% పురోగతిలో ఉండగా, 24% అసలు చేపట్టలేదు. ఈ 650 ప్రాజెక్టులలో ఉద్యానాలు (పార్కులు), నదీ అభిముఖ ప్రాంతాలు, రహదారి మధ్యతల్పాలు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు, జాతీయ రహదారులు ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read