ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఒకే రాజధాని ఉంటుంది. దివాలా తీసిన సౌత్ ఆఫ్రికా లాంటి రాష్ట్రాలతో పోల్చుకుని, మనకు కూడా మూడు రాజధానులు అంటూ, మన పాలకులు తీసుకున్న తలా తోక లేని నిర్ణయంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనే మాటే లేకుండా పోయింది. ఒకే రాజధాని ఉంచండి మహా ప్రభో అని ఉద్యమాలు చేసే స్థాయికి మన పాలకులు తీసుకొచ్చారు. అమరావతి రైతులు, మహిళలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు, తాము బాగుపడతాం అని భూములు ఇచ్చారు. తల్లి లాంటి భూమిని ఈ రాష్ట్రం కోసం ఇచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం రావటంతో, వాళ్ళ పరిస్థితి తలకిందులు అయ్యింది. అటు భూములు పోయాయి, ఇటు రాష్ట్రం బాగుపడలేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. పోరాట బాట పట్టారు. వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అన్నారు, ఒక సామాజికవర్గం వారే అన్నారు , ఒక పార్టీ నడుపుతున్న ఉద్యమం అన్నారు. ఇలాంటి అవహేళనలు అన్నీ దాటుకుని, అమరావతి ఉద్యమం ముందుకు సాగింది. రెండేళ్ళ ఉద్యమ ప్రస్థానంలో, ఉద్యమ హోరు పెంచారు. న్యాయస్థానంలో న్యాయం దక్కాలని, దేవస్థానంలో ధర్మం నిలవాలని, న్యాయస్థానం టు దేవస్థానం అనే మహా పాదయాత్రను మొదలు పెట్టారు. 45 రోజులు పాటు ఈ మహా పాదయాత్ర సాగింది.
ఈ మహా పాదయాత్రకు రాయలసీమలో కూడా అనూహ్య మద్దతు లభించింది. అక్కడ ప్రజలు కూడా అక్కున చేర్చుకున్నారు. మా ప్రాంతానికి అభివృద్ధి కావాలి, అమరావతి రాజధానిగా ఉండాలని నినదించారు. ఈ రోజు తిరుపతిలో అమరావతి పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ ముగింపు సభకు అనూహ్య రీతిలో వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అంతే కాదు ఈ రోజు ముగింపు సభలో అన్ని పార్టీల నేతలు, ఒకే వేదికను పంచుకొనున్నారు. తెలుగుదేశం నుంచి చంద్రబాబు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి కన్నా, కాంగ్రెస్ నుంచి తులసి రెడ్డి, సిపిఐ నుంచి నారాయణ ఒకే వేదిక మీదకు రానున్నారు. అయితే సిపియం మాత్రం, తాము అమరావతికి మద్దతే కానీ, బీజేపీ ఉన్న ఏ వేదిక పంచుకోమని, ఈ మీటింగ్ కు దూరంగా ఉంది. ఇక వైసీపీ ఒక్కటే మద్దతు తెలపటం లేదు. అయితే తిరుపతి మహా సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవటంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.