ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న, ప్రభుత్వం విడుదల చేసిన టికెట్ రేట్ల జీవోని హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే, హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పైన, అపీల్ కు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉంటే, ఈ అంశం పై బాలయ్య మొదటి సారి స్పందించారు. ఈ రోజు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి వచ్చిన బాలయ్య మీడియాతో మాట్లాడారు. అఖండ సినిమా విజయం సాధించిన సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిత్ర యూనిట్ పర్యటనలు చేస్తుంది. ఈ నేపధ్యంలో విజయవాడ వచ్చిన బాలయ్యను, ఆన్లైన్ టికెట్ల విషయం పై స్పందించమని కోరగా, బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆ రోజు మేము అందరం చర్చించుకున్నామని, మా నిర్మాత, దర్శకుడు, మా టీం అంతా మాట్లాడుకున్నామని, ఏదైతే అది అయ్యింది అనుకుని, సినిమాని నమ్ముకున్నాం, సినిమా బాగా వచ్చింది, మనం సినిమా విడుదల చేద్దాం అని, ఆ పరిస్థితిలో కూడా విడుదల చేసాం. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన జీవోని కోర్టు కొట్టేసిందని, మళ్ళీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తాం అంటుందని, చూద్దాం ఏమి జరుగుతుందో అని బాలయ్య అన్నారు. అఖండ సినిమాను, మేమైతే ధైర్యంగా, అప్పుడున్న పరిస్థితిలో విడుదల చేసాం.
అన్నిటికీ ప్రిపేర్ అయ్యాం, మా అభిమానులు మీద, ఇనీ ప్రేక్షకులు మీద నమ్మకంతో, అమ్మవారి ఆశీస్సులతో తప్పుకుండా విడుదల చేద్దాం, విజయం సాధిస్తుందని నమ్మం అని బాలయ్య అన్నారు. విడుదల చేయటానికి అందరూ భయపడుతున్నారు, వాళ్లు వస్తే మనం వెళ్దాం అని సందిగ్ధంలో ఉంటే, మా పని మీద మాకు నమ్మకంతో విడుదల చేసాం, ప్రేక్షకులు ఆదరించారని బాలయ్య అన్నారు. మేము రిలీజ్ చేసిన తరువాత, అందరికీ ధైర్యం వచ్చిందని, సినిమా బాగుంటే, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వచ్చిందని బాలయ్య అన్నారు. ఈ సినిమా రిలీజ్ చేయాలి, విజయం సాధించాలని అందరూ కోరుకున్నారని అన్నారు. తాను కూడా తన వంతుగా, ఏపి ప్రభుత్వంలోని కొంత మందితో, టికెట్ ధరల విషయమై మాట్లాడానని, ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, ఏమి జరుగుతుందో చూద్దామని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే సినిమా అని అందరూ తీసుకున్నారని, తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే మల్టీ స్టారర్ సినిమా తీయటానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని బాలయ్య అన్నారు.