సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో, సిబిఐ పైన నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిన్న, సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో, సిబిఐ విచారణకు సంబంధించి, హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా, అటు సోషల్ మీడియా ప్లాట్ఫారం తరుపున న్యాయవాదులు, ఇటు హైకోర్టు తరుపు న్యాయవాది అశ్వినీ కుమార్, అదే విధంగా సిబిఐ తరుపు న్యాయవాదులు మధ్య తీవ్ర మాటల యుద్ధం నడించింది. విదేశాల్లో కూర్చుని, మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ పట్ల దుషణలు దిగటం పై హైకోర్టు ధర్మాసనం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన వ్యవస్థ సత్తా ఏమిటో చుపించాల్సిన అవసరం ఉందని చెప్పి, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం అభిప్రాయ పడింది. పంచ్ ప్రభాకర్ కు విదేశీ పౌరసత్వం ఉందని సిబిఐ హైకోర్టుకు తెలపగా, హైకోర్టు తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆయన బంధువులు ఎవరు ? ఆయన ఆస్తులు గురించి సిబిఐ ఎందుకు పట్టించుకోవటం లేదని, ఈ సందర్భంగా అశ్వినీ కుమార్ ప్రశ్నించారు. నిందితుల పరస్పర అప్పగింత ఒప్పందంలో భాగంగా సిబిఐ, ఈ దిశగా ఎందుకు ఆలోచన చేయలేక పోతుందని, సిబిఐ ఈ దిశగా ఎందుకు దర్యాప్తు చేయటం లేదని కూడా, ఆయన హైకోర్టులో ప్రశ్నించారు.
సిబిఐ వేసిన అఫిడవిట్ లో ఎటువంటి కొత్త విషయాలు లేవని, అందరికీ తెలిసన అంశాలే అందులో ఉన్నాయని అన్నారు. గూగుల్ లో కొడితే ఈ విషయాలు, సామాన్య ప్రజలకు కూడా తెలుస్తాయని, ఇందులో సిబిఐ గొప్ప ఏమి లేదని, అశ్వినీ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారం విన్న అనంతరం, హైకోర్టు ధర్మాసనం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో, కొంత మంది విదేశాల్లో కూర్చుని, న్యాయ వ్యవస్థ మీద, జడ్జిల మీద, హైకోర్టు మీద తీవ్ర దూషణలకు దిగుతున్నారని, దానికి విదేశీ పౌరసత్వం సాకుగా చూపించటం సరి కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే విధంగా నిందితులను పరస్పరం అప్పగించే ఒప్పందాలు అనేకం ఉన్నాయని, ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయటం లేదని హైకోర్టు ఏకీభవిస్తూ, అసలు సిబిఐ విచారణ ఎంత వరకు వచ్చింది ? ఏమి చర్యలు తీసుకున్నారు ? విదేశాల్లో ఉండే నిందితులను పట్టుకోవటానికి ఏమి చేస్తున్నారు, ఇవి ఎందుకు అరికట్ట లేక పోతున్నారు, ఈ వివరాలు అన్నీ తెలుపుతూ, తమకు సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.