ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శాసనమండలిని రద్దు చేయాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి, కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో బలం ఎక్కువ ఉండటంతో, ప్రభుత్వం తీసుకున్నా అనాలోచిత నిర్ణయాలు అమలు కాకుండా, కొన్ని బిల్లులకు టిడిపి అడ్డు చెప్పింది. అయితే తమకే అడ్డు చెప్తారా అంటూ, ఏమి చేయాలో తెలియని జగన్ మోహన్ రెడ్డి, ఏకంగా శాసనమండలి రద్దు చేస్తూ,తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. ఏడాది ఆగితే శాసనమండలిలో వైసీపీకి బలం వచ్చేస్తుందని చెప్పినా, జగన్ మోహన్ రెడ్డి ఆగలేదు. ఈ శాసనమండలి మీద పెట్టే ప్రతి ఖర్చు వృధా అంటూ, శాసనమండలిని అగౌరవ పరిచారు కూడా. దీంతో ఎవరు ఎన్ని చెప్పినా చేసేది ఏమి లేక, శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించారు. అయితే ఏ విషయంలోనూ మాట మీద నిలబడే తత్త్వం లేని జగన్ మోహన్ రెడ్డి, ఈ విషయంలో కూడా మడమ తిప్పేసారు. శాసనమండలి రద్దు అని చెప్తూనే, కొత్త వారికి మళ్ళీ ఎమ్మెల్సీలుగా అవకాసం ఇచ్చారు. ఇంకా కొంత మందికి హామీలు కూడా ఇస్తూ వచ్చారు. మరో పక్క ఢిల్లీ వెళ్లి, ఈ శాసనమండలి రద్దు బిల్లు పై ముందుకు వెళ్ళమని కేంద్రానికి ఒక్కసారి కూడా విజ్ఞప్తి చేయలేదు.
దీంతో ఈ విషయం కూడా అటక ఎక్కినట్టే అని అందరూ అనుకున్నారు. శాసనమండలిలో ఇప్పుడు వైసీపీకి మెజారిటీ కూడా వచ్చేసింది. దీంతో ఇక మండలి రద్దు వద్దు అనుకున్నారో ఏమో కానీ, ఈ విషయం పై అసలు ప్రస్తావనే చేయటం లేదు. అసలు మండలి ఖర్చు అంతా వృద్ధా అని చెప్పిన వాళ్ళు, ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అయితే ఈ విషయం మాత్రం, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఇదే విషయం పై ఈ రోజు రాజ్యసభలో కేంద్రాన్ని అడిగింది టిడిపి. రాజ్యసభలో ఎంపీ కనకమేడల, కేంద్రాన్ని శాసనమండలి రద్దు అంశం ఎంత వరకు వచ్చింది అని అడిగారు. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, మండలి రద్దు చేయమని ఏపి ప్రభుత్వం తమకు ప్రతిపాదన పంపించిందని, ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీల్లో గుబులు మొదలైంది. కేంద్రం పరిశీలనలో ఉంది అంటే, త్వరలోనే ఏపి పంపించిన శాసనమండలి రద్దు తీర్మానం పై, కేంద్రం నిర్ణయం తీసుకుంటే, వైసీపీ ఎమ్మెల్సీలు మునిగిపోతారు. అయితే ఇప్పుడు ఏపి ప్రభుత్వం, మండలి రద్దు వద్దు అంటూ,మరో తీర్మానం పంపిస్తుందేమో చూడాలి.