అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం మరొక కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అనుమానం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓడ దాటే వరకు ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా వైసిపి వ్యవహరం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అధికారం కోసం అమరావతి రాజధానిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు అమరావతిని చంపాలా అని చూస్తున్నారని మండిపడ్డారు. అమరావతిపై ఇప్పటి వరకు కాలకుట విషాన్ని చిమ్మరని ఆ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోవడంతో ఇప్పుడు ప్రత్యక్షంగా వైసీపీ నేతలు రంగంలోకి దిగారని తెలిపారు. తుళ్లురు మండలం, తాళ్ళాయ పాలెం సమీపంలో కరకట్ట వద్ద కృష్ణా నది నుండి ఇసుకను డ్రెడ్జింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని మునిగిపోయే ప్రాంతం అంటూ గతంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారని కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణానదికి నాలుగైదు సార్లు వరదలు వచ్చినా అమరావతి ప్రాంతంలో చుక్కునీరు కూడా లేదన్నారు. ముంపు ప్రాంతం అని వారు చేస్తున్న విమర్శలను నిజం చేయాలనే కరకట్ట పక్కనే డ్రెడ్జింగ్ పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. కరకట్ట ప్రక్కన డంపింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దీని వల్ల కరకట్ట బలహీనపడుతుందని అమరావతి రాజధాని గ్రామాలకు చెందిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
కృష్ణానది ఒడ్డు నుండి 500 మీటర్ల లోనికి నీటిలోకి వెళ్లి డ్రెడ్జింగ్ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్న అధికారులు కానీ, వైసీపీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడ లేదని మండిపడ్డారు. కరకట్ట బలహీన పడితే భవిష్యత్ లో నదికి వరదలు వస్తే అమరావతి పంట పొలాల్లోకి వరద నీరు వస్తుందని అప్పుడు గతంలో అమరావతి ముంపు ప్రాంతమంటూ వారు చేసిన విమర్శలను నిజం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతి ఎప్పుడు నాశనం చేయాలా అని జగన్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇస్తే దానిలో ఇసుక నిల్వలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిని అభివృద్ది చేయడం రాదు కానీ మళ్లీ మూడు రాజధానులు పెడతామని ప్రగల్బలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉన్న సంగతి మంత్రి బొత్స సత్యనారాయణ మర్చిపోయి మాట్లాతున్నారని తెలిపారు. రైతులను, అమరావతి రాజధాని ప్రాంతాల గ్రామస్తులకు ఇబ్బందులు కలుగకూండా డ్రెడ్జింగ్ చేసుకోవాలన్నారు. అమరావతిపై ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా అంతీమంగా న్యాయమే విజయం సాధిస్తుందని, అమరావతిపై దుష్పచారం చేయాలనుకుంటే ప్రజలేవ్వరు నమ్మరని తెలిపారు.