మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి, పోటీలో ఉన్న ప్రతిపక్ష నేతలను విత్ డ్రా చేసుకునే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నుంచి విపరీత ఒత్తిడులు వస్తున్నాయి. ముఖ్యంగా బలవంతపు ఉపసంహరణకు అధికార పార్టీ, అన్ని అవకాశాలు ఉపయోగిస్తుంది. డబ్బు, అధికార, అక్రమ కేసులు, ఇలా అన్నీ ఉపయోగించి, ప్రతిపక్ష నేతలను లొంగదీసుకునే పనిలో ఉన్నారు. దీని పై ఇప్పటికే , వివిధ రాజాకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. అయితే బలవంతపు ఏకాగ్రీవాలు జరిగాయని తెలిస్తే, చర్యలు తీసుకుంటాం అంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఏలూరు కార్పొరేషన్ కు సంబందించి, టిడిపి సీనియర్ నేత తమనేని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. 23వ డివిజన్లో టీడీపీ అభ్యర్థిని, అధికార పార్టీ నేతలు బలవంతంగా విత్డ్రా చేపించటంతో, చింతమనేని మరో ఎత్తు వ్హేసి, 23వ డివిజన్లో జనసేన-బీజేపీ అభ్యర్థులుంటే ప్రచారంలో పాల్గొంటానని, ప్రకటించి, అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. చింతమనేని మాట్లాడుతూ "ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక, మా అభ్యర్ధులను సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు. స్థానిక మంత్రి గారు, ఆయన అనుచరులు, ఈ రకమైన దుర్మార్గమైన బేరసారాలు ఆడటం, ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అయిన విషయం. వీళ్ళు చేస్తున్న పనులకు ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. దీనికి ఇంకా ఆజ్యం పోసి, రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఇంకా అసహ్యించుకునేలా, కొత్త సంస్కృతిని ఈ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. "
"మా వాళ్ళు కొంత మంది, ఎంతో దుర్మార్గంగా, పార్టీనే మా కన్న తల్లి అని చెప్పి, ఇటువంటి కన్నతల్లి లాంటి పార్టీని అన్యాయం చేసి, డబ్బుకు అమ్ముడుపోతున్నారు వెధవల్లారా అని చెప్పి, నేను అడుగుతున్నాను. నీకు నిజాయతీ ఉంటే, నువ్వు ప్రజల్లోకి వెళ్లి, నువ్వు చేయబోయే మంచి పనులు, జరుగుతున్న అవినీతి గురించి చెప్పి, ప్రజల్లో ఓట్లు అడిగి, ప్రజాస్వామ్యంలో నిలబడాలి కానీ, ఇదేంటి ? అన్నదమ్ములని, తండ్రి కొడుకులని కూడా విడదీసి, డబ్బు ఎరా చూపి, విభజించి పాలించటం , ఇదేనా ప్రజాస్వామ్యం అని మేము అడుగుతున్నాం. మా నాయకులు ఎవరైతే నిలబడ్డారో, వారికి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే, వారు నీతికి నిజాయతీకి నిలబడ్డారు. ఈ రోజు వాళ్ళు ఓడవచ్చు, గెలవచ్చు. ఈ రోజు ఇంత డబ్బు ప్రవాహాన్ని కూడా మాకు వద్దు అని చెప్పి, నిలబడ్డారు. ఎంత మంది ఉంటే, అంత మందితో, వీరిని ఎదుర్కుంటాం. మా పార్టీ నుంచి, ఆ పార్టీలోకి వెళ్ళిన వారికి బుద్ధి చెప్తాం. అక్కడ జనసేన, బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇస్తా. నేనే అక్కడ తిరుగుతా" అని చింతమనేని అన్నారు.