గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతి, పోలవరం రెండు కళ్ళుగా తీసుకుని ముందుకు వెళ్ళారు. దానికి కారణం, అమరావతి 13 జిల్లాలకు ఉపాధి, ఆర్ధిక కేంద్రం అవుతుందని. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ప్రతి జిల్లాకు నీరు ఇస్తుందని. అందుకే ఈ రెండు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్లారు. అయితే కొత్తగా వచ్చిన అధికార పార్టీ అమరావతి పై కులం ముద్ర వేసి, దాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉంది. ఇక పోలవరం నిర్మాణం పై ఆశలు పెట్టుకున్న వారికి కూడా ఇప్పుడు షాక్ ఇచ్చే వార్తలు బయటకు వస్తున్నాయి. 22 ఎంపీ సీట్లతో, దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ, కేంద్రం నుంచి పోలవరం నిధులు తేవటంలో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాదాపు 3 వేల కోట్లను, ఇప్పటికీ రాష్ట్రం తెచ్చుకోలేక పోయిందనే విమర్శలు వస్తున్న వేళ, అసలకే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, పోలవరం అంచనాలు, రూ.57,940 కోట్లకు పెంచారు. 2013-14 రివైజడ్ కాస్ట్ ఎస్టిమేట్ ప్రకారం, రూ.57,940 కోట్లకు పెంచి డీపీఆర్-2ని కేంద్రానికి పంపించారు. దాదపుగా కొన్ని వేల పేజీలు , ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నాలు ఫలితమే, 2019 ఫిబ్రవరిలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ, సిడబ్ల్యుసి కూడా 55,548 కోట్లకు, ఆమోదం తెలిపింది. ఇక అప్పటికే ఎన్నికల సీజన్ మొదలు కావటంతో, ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.
ఇక కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదమే తరువాయి. కీలకమైన టెక్నికల్ కమిటీ ఆమోదం చెప్పటంతో, ఆర్ధిక శాఖ ఆమోదం లాంచానమే అవుతుందని అందరూ భావించారు. అందులో కొత్తగా వచ్చిన వైసీపీకి బలం ఉండటం, రాజ్యసభ సీట్లు బీజేపీకి అవసరం ఉండటంతో, వైసీపీ ఈ పని చాలా తేలికగా చేపిస్తుందని అందరూ భావించారు. అయితే 18 నెలలు అయినా, ఈ విషయం పై ఆతీ గతీ లేదు. కానీ నాలుగు రోజుల క్రిందట ఢిల్లీ నుంచి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కేవలం 25 వేల కోట్లకే పోలవరం అంచనాలు ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. గత నాలుగు రోజులుగా ఈ విషయం పై చర్చ కొనసాగిస్తూ ఉండగానే, ఈ రోజు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. విజయవాడకు చెందిన ఒక వ్యక్తి, పోలవరం ప్రాజెక్ట్ పై, సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరారు. దీని పై స్పష్టత ఇచ్చిన కేంద్రం, మేము కేవలం పోలవరం ప్రాజెక్ట్ డ్యాం నిర్మాణానికి మాత్రమే మేము డబ్బులు ఇస్తామని, పునరావాస, పరిహారంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పటంతో, అందరూ అవాక్కయ్యారు. అయితే ఈ విషయం పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం పై తప్పు తోసివేసి, ఈ అంశం పై సేఫ్ అవ్వాలనే ఆలోచనలో ఉంది. అయితే ఇది పోలవరం ప్రాజెక్ట్.. ప్రతి ఒక్క వ్యక్తి లాభం చెందే ప్రాజెక్ట్. మరి, ఈ విషయం పై, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాజ్యసభలో వైసీపీ బలం , బీజేపీకి అవసరం కాబట్టి, అక్కడ ఒత్తిడి తెస్తే, రాష్ట్రానికి లాభం అవుతుంది మరి ప్రభుత్వం, అంత పోరాటం చేస్తుందా ?