అమరావతి 300 రోజుల ఉద్యమం సందర్భంగా నారా లోకేష్, ఈ రోజు అమరావతిలో పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన వివిధ శిబిరాల్లో పాల్గున్నారు. వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గుని, ప్రసంగించారు. తన కార్యక్రమం ముగుసిన తరువాత, అయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఇటీవల న్యాయ వ్యవస్థ పై జగన్ రాసిన లేఖ గురించి లోకేష్ వద్ద ప్రస్తావించగా, లోకేష్ ఇలా స్పందించారు. "నేను దీని మీద స్పందించదలుచుకోలేదు. వాళ్ళు ఏమి చేయాలి అనుకుంటున్నారో, మనకు అర్ధం అవుతుంది. మన దౌర్భాగ్యం కాకపొతే, 16 నెలలు జైలుకి వెళ్ళినవాడు, 11 సిబిఐ కేసులు తన పై పెండింగ్ ఉన్న వాడు, అలాగే 28 వరకు 420 కేసులు ఉన్న వ్యక్తి, సిబిఐ, ఈడీ, ఫేమా, ఇలా అన్ని రకాల వైట్ కాలర్ నేరాలు చేసిన వ్యక్తిగా అతని ట్రాక్ రికార్డు ఉంది. ఇలాంటి వ్యక్తులు, ఇన్ని కేసులు వారి వెనుక పెట్టుకుని, ఇలాంటి వారు న్యాయవ్యవస్థ పై దాడి చేస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం మాత్రమే కాదు, దేశ సమగ్రతకే ఇలాంటి వారు ముప్పు. " అని లోకేష్ అన్నారు.

ఇక అలాగే అమరావతి ఉద్యమం పై, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై కూడా లోకేష్ స్పందించారు. గత 300 రోజులుగా అమరావతి ప్రజలు పిల్లా పాపలతో, ఉద్యమం చేస్తుంటే, ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదని, వీరి వద్దకు వచ్చి, మీ బాధలు ఏంటి అని అడగలేదని, ఒక్క మంత్రి కానీ, చివరకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాలేదని లోకేష్ అన్నారు. రాకపోగా, రైతులను అవమానపరుస్తున్నారని, బూతులు తిడుతున్నారని, వారిని పర్సనల్ గా తిడుతున్నారని, ఇది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, వారి పోరాటానికి ఎప్పుడూ మద్దతు ఉంటుందని లోకేష్ అన్నారు. అమరావతి పై అనేక ఆరోపణలు చేసారని, ఈ 16 నెలల్లో ఒక్కటంటే ఒక్క ఆరోపణ అయినా రుజువు చేయలేక పోయారని లోకేష్ అన్నారు. అమరావతి అనేది ఒక మంచి మోడల్ సిటీ అని, మన దేశానికీ ఈ శతాబ్దిలో నిర్మాణం అవుతున్న, మంచి మోడల్ సిటీ అని, ఇలాంటి అమరావతిని నిర్వీర్యం చేయకుండా, నిర్మాణం చేయాలని అన్నారు.

ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డి పై, మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి ఈ సారి, చంద్రబాబు పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. గత నాలుగు అయిదు నెలలుగా సైలెంట్ అయిన జేసీ దివాకర్ రెడ్డి, గత వారం రోజులుగా మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు. ఆయనకు సంబంధించిన మైనింగ్ కంపెనీల పై, అధికారులు సోదాలు చేసి, నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ ఆరోపణలతో పాటుగా, అక్కడ పని చేస్తున్న వారికి సరైన వసతలు కల్పించటం లేదని ఆయన పై ఆరోపణలు మోపి కేసు పెట్టారు. దీని పై జేసీ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనకు జీవనాధారమే మైన్స్ అని, తనని ఆర్ధికంగా దెబ్బ కొట్టి, మానసికంగా చం-పేయటానికి జగన్ వేసిన ప్లాన్ ఇదని అన్నారు. మొన్నది దాకా తన తమ్ముడిని ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు తనను ఇబ్బంది పెడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ ఎపిసోడ్ కి కొనసాగింపుగా, ఆయన ఒక ప్రముఖ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో చంద్రబాబు పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని, తనకు వంద శాతం నమ్మకం ఉందని, రేపు అధికారంలోకి వచ్చేది మళ్ళీ తెలుగుదేశం పాలనే అని, అయితే ఈ సారి మాత్రం చంద్రబాబు గారు, ఇప్పుడు జరుగుతున్న దానికంటే, రెండు ఇంతలు దుర్మార్గపు పాలన చెయ్యాలని తామందరం కోరుకుంటున్నామని అన్నారు.

చంద్రబాబు గారి మద్దతు దారులమైన మేమందరం కలిసి, ఆయన మెడ పై క-త్తి పెట్టి అయినా సరే, ఇలాంటి దుర్మార్గపు పాలన చెయ్యాలని కోరుకుంటామని, అందరి లెక్కలు, వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని జేసీ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు గారు అలాంటి స్టైల్ లో పరిపాలన చెయ్యకపోయినా, ఈ సారి మాత్రం తప్పదని, అలా చెయ్యాల్సిందే అని జేసి దివాకర్ రెడ్డి అన్నారు. తమ పై ఎంత దుర్మార్గపు పాలన చేస్తున్నారో, దానికి బదులు తీర్చుకోవాల్సిందే అని అన్నారు. చంద్రబాబు స్వతహాగా చాల సాత్వికుడు అని, ఆయనకు ఇవన్నీ తెలియవు అంటే కుదరదని అన్నారు. ప్రతిపక్షంలో ఉంటే పార్టీ అండగా ఉంటుంది అని ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయని, మాపైన ఇప్పుడు బండలు వేస్తున్నారని అన్నారు. తమకు ఇబ్బందులు పెట్టే వారికి తిరిగి చెల్లిస్తాం అని, అలా చెయ్యకపోతే, ఇంకా చంద్రబాబు నాయకత్వం ఎందుకు అంటూ వ్యాఖ్యలు చేసారు. పరిపాలన పరిపాలనే అని, ఇలాంటివి కూడా చెయ్యాలని చంద్రబాబుని కోరుతామని జేసి అన్నారు. గత కొంత కాలంగా జేసి బ్రదర్స్ పై అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడా, కో-వి-డ్ నిబంధనలు అతిక్రమించారని కేసు పెట్టారు.

రాజధాని అమరావతికి సంబందించిన అనుబంధ పిటీషన్ల పై ఈ రోజు హైకోర్టులో విచారణ ముగిసింది. 23 రిట్ పిటీషన్లలో ఉన్న అనేక అనుబంధ పిటీషన్ల గురించి, ఈ రోజు వాదనలను తీసుకున్నారు. అయితే ఇందులో కొన్ని పిటీషన్లు న్యాయస్థానం ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆదేశాల పరిధిలోకే వస్తాయని, ఇరు పక్షాల న్యాయవాదులు అంగీకరించారు. అయితే రెండు విషయాల్లో మాత్రం, ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి. ఒకటి క్యాంప్ ఆఫీస్ విషయం, రెండు విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం. రెండు విషయాలు కూడా స్టేటస్ కో పరిధిలోకి తీసుకు రావచ్చ లేదా అనే దాని పై వాదనలు జరిగాయి. పిటీషనర్ న్యాయవాదులు క్యాంప్ ఆఫీస్ కు సంబంధించి వాదనలు చేసినప్పుడు, నిజంగా ముఖ్యమంత్రి గారి సౌలభ్యం కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టుకోకూడదు అని మేము అనటం లేదని, రాజధాని తరలింపులో భాగంగా, క్యాంప్ ఆఫీస్ పెడితేనే మాకు అభ్యంతరం అని చెప్పటం జరిగింది. దాని మీద ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, దాని పై తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. ఇక విశాఖపట్నం గెస్ట్ హౌస్ కి వచ్చే సరికి, దాని పై గతంలోనే చీఫ్ సెక్రటరీ గారు అఫిడవిట్ దాఖలు చేసారు. దాంట్లో వారు చెప్పింది, ఇది రాజధానిలో భాగం కాదని, రాష్ట్రంలో మంత్రులు, అధికారులు పర్యటన చేసేప్పుడు, ప్రైవేటు హోటల్స్ లో డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి, దాన్ని నివారించేందుకు మేము విజయవాడ, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ లు నిర్మాణం చెయ్యాలని నిర్ణయం చేసామని, అందులో భాగంగానే మేము విశాఖలో నిర్మాణం చేస్తున్నామని కోర్టుకు చెప్పారు.

అయితే పిటీషనర్ తరుపు న్యాయవాది స్పందిస్తూ, విశాఖపట్నం గెస్ట్ హౌస్ కు సంబంధించి వివరాలు ఇవ్వలేదని, గోప్యంగా ఉంచుతున్నారని, మిగతా చోట్ల అన్ని వివరాలు ఉన్నాయని, ఎంత విస్తీర్ణంలో ఎంత ఖర్చు అవుతుందో చెప్పారని, విశాఖలో మాత్రం చెప్పలేదని కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పందిస్తూ, ఈ రిట్ పిటీషన్ పరిధి రాజధానికి సంబంధించి అని, రాజధానిలో భాగంగా కట్టటం లేదు అని చెప్పామని తెలిపారు. అయితే దీని పై కూడా వాదనలు ముగియటంతో, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. ఇక మెయిన్ పిటీషన్ తప్పితే, ఈ అనుబంధ పిటీషన్లు అన్నీ ఆర్డర్స్ రిజర్వ్ చెయ్యటం జరిగింది. మెయిన్ పిటీషన్ పై కూడా రోజు వారీ విచారణకు సిద్ధం అని కోర్ట్ చెప్పగా, న్యాయవాదులు అభిప్రాయాలు, దసరా సెలవలు, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత, నవంబర్ 2 నుంచి ఈ రోజు వారీ విచారణ జరుగుతుందని, వారికి 7 రోజులు, వీరికి 7 రోజులు ఇస్తాం అని, న్యాయస్థానంలో కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ వాదనలు వినిపించవచ్చని, కోర్టు తెలిపింది.

న్యాయమూర్తుల పై సోషల్ మీడియా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పై పూర్తి విచారణ జరిపి ఎనిమిది వారాల్లోగా తమకు నివేదిక అందించాలాని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కాలంలో కూడా హైకోర్టు పై, న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ కోర్టు ఆదేశించింది. అలాగే సిబిఐకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. దీంతో దీని పై సిబిఐ కేసు నమోదు అయిన వెంటనే, రెండు నెలల్లోగా ఈ కేసు పై విచారణ జరిపి, హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఈ కేసు పై పోయిన వారం విచారణ జరిగిన సందర్భంలో, సిఐడి ఈ కేసులో సాధించిన పురోగతి పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 90 మందికి పైగా పేర్లు ఇస్తే, 20 మందిని కూడా విచారణ చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేసిన వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి హైకోర్టు పై వ్యాఖ్యలు చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఇది కావాలనే కోర్టుల పై కుట్ర పన్నినట్టు తెలుస్తుందని, దీని వెనుక ఉన్న కుట్రను తేలుస్తామని, ఇది ఇలాగే కొనసాగితే, కోర్టుల పై నమ్మకం పొతే సివిల్ వార్ కు దారి తీస్తుందని హెచ్చరించింది.

ఈ కేసులో సిఐడి పని చేయలేకపోతే , బెటర్ ఇన్వెస్టిగేషన్ కి ఇవ్వాల్సి వస్తుందేమో అని కోర్టు వ్యాఖ్యానించటంతో, తమకు సిబిఐకి ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరుపు న్యాయవాది. దీంతో ఈ రోజు ఈ కేసు విచారణ మళ్ళీ రావటంతో, ఈ కేసు పై నిర్ణయం తీసుకున్న హైకోర్టు, సిఐడి సరిగ్గా పని చేయలేదని భావించి, ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. అయితే ఈ కేసు పూర్వాపరాలకు వెళ్తే, గతంలో హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల పై, వైసిపీ సోషల్ మీడియా, నాయకులు కలిసి సోషల్ మీడియాలో న్యాయమూర్తుల పై , కోర్టు ల పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇవన్నీ చూసిన హైకోర్టు రిజిస్టార్, దీని పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పూర్తీ ఆధారాలు కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసుని సిఐడిని విచారణ చేయమని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ సందర్భంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, మా వాళ్ళను మేము కాపాడుకుంటామని, తాను సోషల్ మీడియా ఇంచార్జ్ ని అంటూ చెప్పటం వివాదాస్పదం అయ్యింది. అయితే కోర్టులో కేసు ఉన్నా, నేటికి వైసిపీ సోషల్ మీడియాలో ఇప్పటికీ కోర్టుల పై, న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారి పై కూడా కేసు పెట్టమని హైకోర్టు చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read