జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాజ్యాంగం ద్వారా, శాసనసభ తీర్మానం ద్వారా, చట్టాలు ద్వారా ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని, మూడు ముక్కలు చెయ్యాలని, ఏ నిమిషాన అనుకున్నదో కానీ, అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 151 సీట్లు వచ్చినా, అనవసరమైన విషయాలు నెత్తిన పెట్టుకుని, జగన్ మోహన్ రెడ్డి ఇబ్బందుల్లోకి వెళ్లారు. 29 వేల మంది రైతులతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉండటంతో, అమరావతి రైతులు, హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టుకు వెళ్ళిన ప్రభుత్వానికి అక్కడ ఎదురు దెబ్బ తగిలింది, ఏదైనా ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే తేల్చుకోవాలని, తరువాత ఇక్కడకు రావాలని చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపుగా 93 కేసులు అమరావతి పై పడ్డాయి. అయితే ఇప్పుడు అమరావతి సంగతి పక్కన పెడితే, రాష్ట్ర ప్రభుత్వానికి మరో తల నొప్పి వచ్చి పడింది. అది కూడా అమరావతికి సంబందించిన విషయమే.
గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, భూమి అడిగితే, రైతులు ఇవ్వలేదు. తమది విలువైన భూమి అని, ప్రభుత్వానికి ఇవ్వం అని చెప్పారు. అయితే చంద్రబాబు వారిని ఒప్పించి, అమరావతిలో భూసమీకరణ కింద ప్యాకేజ్ ఇస్తామని చెప్పటంతో, రైతులు భూములు ఇచ్చారు. అయితే ఇప్పుడు అమరావతి మూడు ముక్కలు అవ్వటంతో, గన్నవరం ఎయిర్ పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతులు, పునరాలోచనలో పడ్డారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రభుత్వం ఉల్లంఘించిందని ఎదురు తిరిగారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కి, భూసమీకరణ కింద 40 ఎకరాలు ఇచ్చిన సినీ నిర్మాత అశ్వనీ దత్ హైకోర్ట్ మెట్లు ఎక్కారు. తమకు సీఆర్డీఏ పరిధిలో, భూమి ఇస్తాం అన్నారని, అయితే ఇప్పుడు సీఆర్డీఏ పరిధి నుంచి రాజధానిని తప్పించి, అగ్రిమెంట్ ఉల్లంఘించారని పిటీషన్ లో తెలిపారు. తమకు ఇచ్చిన భూమి తిరిగి ఇవ్వాలని, లేకపోతే నాలుగు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని, ఆయన పిటీషన్ దాఖలు చేసారు.