ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వినియోగం, కొత్త ప్రాజెక్టుల విషయంలో, అగ్గి రేగిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా మరో ప్రతిష్టంభన నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగడంపై చర్చలు గత నెల రోజులుగా ముందుకు సాగడం లేదు. నిన్నమొన్నటి వరకు కిలో మీటర్ల ప్రాతిపదికన బస్సులు నడుపుదామంటూ పట్టుబట్టిన తెలంగాణ అధికారులు..తాజాగా రూట్ల ప్రాతిపదికన బస్సులు నడుపుదాంటూ పట్టుబట్టడంతో మంగళవారం నాటి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వివాదం పరిష్కారం అయ్యే వరకు రోజుకు 70వేల కిలో మీటర్ల మేర 250 సర్వీసులు రెండు వైపుల నుంచి తాత్కాలికంగా నడుపుదా మంటూ ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనకు సైతం తెలంగాణ అధికారులు ముందుకు రాలేదని తెలిసింది. గత 2 నెలలుగా తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారు లు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చలు ఎంతకూ కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రరవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు - టీఎస్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మతో మంగళవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు.
రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసుల పునరుద్దరణపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ అధికారుల కోరిక మేరకు కిలో మీటర్లు తగ్గించుకునేందుకు ఏపీ అధికారులు ముందుకొ చ్చారు. 2.62లక్షల కిలో మీటర్ల నుంచి లక్షా 50 వేల కిలో మీటర్లకు తగ్గేందుకు అంగీకరించారు. తొలి రోజుల్లో ఏపీ బస్సులు తెలంగాణ భూభాగంలో 3.48 లక్షల కిలో మీటర్లు రోజువారీ రాకపోకలు సాగించేవి. అప్పట్లో అక్కడి అధికారుల ప్రతిపాదనల మేరకు 2.62 లక్షలకుకిలో మీటర్లు పరిమితం చేసి రోజుకు 800 సర్వీసులను ఏపీఎస్ ఆర్టీసీ నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్షన్నర కిలో మీటర్ల మేర ఏపీలో 300 బస్సు సర్వీసులు నడుపుతోంది. గత రెండు నెలలుగా ఆర్టీసీ సర్వీసుల పునరుద్దరణకు ఏపీ అధికారులు పలు ప్రతిపాదనలు చేసినప్పటికీ కిలో మీటర్లు తగ్గిస్తే తప్ప అంగీకరించేది లేదంటూ తెలంగాణ అధికారులు పట్టుబట్టారు. తాము తగ్గడం కంటే టీఎస్ ఆధికారులు పెంచుకోవాలని ఏపీ అధికారులు చేసిన సూచనకు అక్కడి అధికా రులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రా లరవాణాశాఖ ముఖ్య కార్యదర్శుల భేటీలో 2.62 లక్ష ల కిలోమీటర్ల నుంచి లక్షన్నర కిలో మీటర్లకు పరిమితం అయ్యేందుకు ఏపీ అధికారులు ముందు కొచ్చారు. ఓవైపు ఏపీ అధికారులు మెట్టుదిగి కిలో మీటర్లు తగ్గించుకుంటే..మరో వైపు టీఎస్ అధికారులు రూట్ల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు.