ప్రధాని నరేంద్రమోదికి, ఏపి మాజీ సిఎం చంద్రబాబు లేఖ. ఏపిలో ప్రాధమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘించడం, పాలక వైయస్ఆర్సీపి ద్వారా ఫోన్ ట్యాపింగ్, ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేయడం, ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేయడంపై ఆ లేఖలో ప్రధాని మోదికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు. మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత ఇనుమడించింది. భారత సాయుధ దళాల్లో నూతన విశ్వాసం పెరిగింది. అంతర్గత ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులతో వచ్చే ముప్పు తగ్గింది. విదేశీ సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి: ప్రధానికి లేఖలో చంద్రబాబు ఏపిలోని రాజకీయ నాయకులు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్ తో తీవ్ర ముప్పు ఉంది. దేశ భద్రతకే ఇది పెను ప్రమాదంగా పరిణమించే ప్రమాదం ఉంది. వైకాపా పాలనలో ఏపి ప్రజలు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు పెరిగాయి. మొదట్లో గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై, విధానాలపై దాడి చేశారు. దీంతో రాష్ట్రంలో పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) తదితర సంస్థలపై దాడులు.. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలపై వైకాపా దాడులు, బెదిరింపులకు వైకాపా పాల్పడుతోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం అధికార వైసిపి దినచర్యగా మారింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 [సెక్షన్ 5 (2)] మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [సెక్షన్ 69] ప్రకారం, జాతీయ భద్రతకు ముప్పు ఉన్న సందర్భంలో లేదా సార్వభౌమాధికారం, దేశ సమగ్రత కోసం, విదేశీ స్నేహ పూర్వక సంబంధాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో టెలి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్ చేయడంలో ఎటువంటి చట్టబద్ధమైన విధానాన్ని వైసిపి ప్రభుత్వం పాటించడం లేదు. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19, ఆర్టికల్ 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. పౌరుల గోప్యతా హక్కును కాలరాయడమే ఇది. భారతీయ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5 (2) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 లోని సెక్షన్ 69 లను కూడా వైసిపి ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ఏపిలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను వైసిపి ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోంది.
రాజకీయ లాభాల కోసమే చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్ చేస్తోంది. ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనేది మా ఆందోళన. జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అరాచకశక్తుల చేతిలో ఉంటే, వ్యక్తుల గోప్యతా హక్కు కాలరాయడమే.. అత్యున్నత స్థానాల్లోని వ్యక్తుల బ్లాక్ మెయిలింగ్ కు, బెదిరించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ దారితీస్తుంది. ఏదోవిధంగా తమ అధికారాన్ని నిలుపుకోవాలనే తపనతో అధికార వైసిపి దారుణంగా బెదిరిస్తోంది. వైసిపి తప్పుడు పనులకు వ్యతిరేకంగా గళం వినిపించే వ్యక్తులు, సంస్థలపై దాడి చేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఎవరినీ వదలడం లేదు. తమ చర్యలకు న్యాయవ్యవస్థ నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో, ప్రజాస్వామ్య వ్యవస్థ మూడో స్తంభమైన న్యాయవ్యవస్థను కూడా పాలక వైయస్ఆర్సిపి ప్రస్తుతం లక్ష్యంగా చేసుకుంది. ప్రైవేటు వ్యక్తులు కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజి, పరికరాలు వినియోగించి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తున్నారు. ఈవిధమైన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ లకు అడ్డుకట్ట వేయకపోతే దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికే పెనుముప్పు. ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తుల చట్టవిరుద్దమైన అక్రమ చర్యలను కట్టడి చేయకపోతే ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తుంది. ఇటువంటి దుశ్చర్యలు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గిస్తాయి. ఆటవిక రాజ్యం(జంగిల్ రాజ్) వైపు దారితీస్తాయి. ఏపిలో అధికార వైసిపి, ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ లాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపిలో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించడం సముచితం. ప్రధాని మోదికి రాసిన లేఖలో పేర్కొన్న చంద్రబాబు.
కేంద్ర ఐటి శాఖా మంత్రికి కూడా లేఖ ప్రతిని పంపిన చంద్రబాబు