అచ్చెన్నాయుడు అరెస్టు పై అవినీతి నిరోధక శాఖ అధికారులు, ప్రెస్ మీట్ పెట్టి, పూర్తి వివరాలు వెల్లడించారు. అచ్చెన్నాయుడు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని అందుకే అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం నుంచి 130 శాతం ఎక్కువకు మందులు కొనుగోలు చేసినట్టు మా దర్యాప్తులో తేలింది అని అన్నారు. అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. మందుల కొనుగోళ్లలో రూ.150 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలిందని అన్నారు. అచ్చెన్నాయుడిని విజయవాడ కోర్టులో హాజరుపరుస్తున్నాం అని అన్నారు. అచ్చెన్నాయుడుతో పాటుగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశాం అని అన్నారు. అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్, విజయ్ కుమార్ ను అరెస్టు చేసినట్టు ఏసిబీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ దర్యాప్తు తర్వాత అనిశా విచారణ జరిగిందని, నకిలీ బిల్లులు, ఇన్ వాయిస్, లెటర్ హెడ్స్‌లను గుర్తించాం అని, ఇవన్నీ చేసిన తరువాతే అచ్చెన్నాయుడు గారిని ఉదయం 7:30 గంటలకు అరెస్ట్ చేసాం అని అన్నారు. ఆయన్ను విజయవాడ తరలిస్తున్నట్టు చెప్పారు.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్డ్ ను ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. "టీడీఎల్పీ ఉపనాయకుడు, రాష్ట్రంలో ప్రముఖ బీసీ కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గం. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలా అరెస్ట్ చేయడం కుట్రే. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వస్తే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మాత్రం డిపార్టుమెంట్ విచారణ లేకుండా నేరుగా బీసీ నేతపై కక్ష కట్టి అరెస్ట్ చేయడం బలహీనవర్గాలను వేధించడమే." అని అన్నారు.