విశాఖపట్నంలో, ఈ రోజు డాక్టర్ సుధాకర్, అర్ధనగ్నంగా ఉంటూ, పోలీసులు చేతులు వెనక్కు విరిచేసి, చేతులు కట్టేసి, ఆయన్ను ఆటో ఎక్కిస్తూ ఉన్న దృశ్యాలు అందరూ చూసారు. నర్సీపట్నం హాస్పిటల్ లో, మాస్కులు ఇవ్వలేదు అని అడిగినందుకు, అప్పట్లో ప్రభుత్వ డాక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ ను , ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈ రోజు ఆయన ఆందోళన చెయ్యటం, అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు, ఆయన చేతులు వెనక్కు విరగదీసి తాళ్లు కట్టి పోలీస్ స్టేషన్ కు తరలించటం చూసాం. ఈ ఘటన చూసిన అందరూ, ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. దళితుడుగా పుట్టి, పేదరికంలో పెరిగి, అన్నీ తట్టుకుని, కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యి, 20 ఏళ్ళు సర్వీస్ చేసిన ఒక డాక్టర్ కు, ఈ రోజు ఈ పరిస్థితి పట్టింది అంటే, అది కేవలం ప్రభుత్వ వైఖరి వల్లే అని విపక్షాలు విమర్శించాయి. తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఉదంతం పై, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక దళితుడు, మిమ్మల్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక, ఈ పరిస్థితికి తెచ్చారా అని ప్రశ్నించారు.
అయితే ఈ మొత్తం ఘటన పై, విశాఖపట్నం పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా స్పందించారు. ముందుగా తమకు పోర్ట్ ఆసుపత్రి వద్ద ఒక వ్యక్తి నడి రోడ్డు పై, అనుచితంగా ప్రవర్తించారని, తమకు డయిల్ 100 కు ఫోన్ వచ్చిందని చెప్పారు. తమకు ఫిర్యాదు రాగానే, అక్కడ దగ్గరలో ఉన్న పోలీసులను స్పాట్ కు పంపించామని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. డాక్టర్ సుధాకర్ చిత్తుగా తాగి ఉన్నారని, కమీషనర్ చెప్పారు. తాగి ఉండటంతో, ఆయన మాట వినలేదని, అందుకే ఫోర్సు తో అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు కోసం, కేజీహెచ్‌కు తరలించామని చెప్పారు. అయితే, మరో పక్క, అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు, ఆర్కే మీనా మీడియాకు చెప్పారు.
అంటే పోలీసులు తప్పు ఉందని ఒప్పుకున్నారు. ఒక వేళ డాక్టర్ తాగి ఉన్నా, ఆయన్ను అలా చేతులు వెనక్కు విరగదీసి, తాడులతో కట్టేసి, అంత మంది పోలీసులు ఆయన్ను అలా ఈడ్చుకుని వెళ్ళటం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎంతో మంది తాగి రోడ్డుల మీద తిరుగుతుంటే, ఇలాగే కట్టేసి, ఈడ్చుకుని స్టేషన్ లో పడేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఇలా మందు తాగి రోడ్డుల మీదకు రావటానికి ప్రభుత్వం కాదా, కరోనా టైంలో ఎందుకు షాపులు ఓపెన్ చేసారు అని ప్రశ్నిస్తున్నారు. సుధాకర్ ను అలా ఈడ్చుకుని వెళ్ళటం తప్పు కాబట్టే, అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతోనే, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసారని, ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు.