వచ్చే ఏడాది జూన్, జులైలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనిలో భాగంగానే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందుస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి, కమిషనర్ కార్యాలయాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలు ఎప్పడు జరిగినా వాటికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతమున్న గ్రామ సర్పంచ్ల పదవీకాలం 2018 ఆగస్టు ఒకటవ తేదీ నాటికి ముగియనుంది. రాజ్యాంగంలోని ఆగ్రికల్ 243ఈ3(ఏ) నిబంధన ప్రకారం పదవీకాలం ముగిసేలోపే తదుపరి ఎన్నికల ప్రక్రియు పూర్తి చేయాల్సిన అవసరం ఉండగా, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 ప్రకారం పాత సర్పంచుల పదవి ముగిసే మూడు నెలల ముందు వీలును బట్టి ఏప్పడైనా ఎన్నికలు పూర్తిచేయవచ్చు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామ పంచాయతీలకు తాజాగా ఎన్నికల నిర్వహణ అవసరమైన ముందుస్తు ప్రణాళికను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. కొత్త పంచాయితీల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీనం తదితర అంశాల ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేసి, ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖని ఈసీ కోరింది. 2018 జనవరి 1వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మార్చి 31వ తేదీ పూర్తిచేసి, పంచాయతీ ఎన్నికల్లో వార్డుల రిజర్వేషన్ల వివరాలు మే నెలాఖరుకల్లా ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటుంది.