రాష్ట్రంలో కాగిత రహిత పాలన కొనసాగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా శుక్రవారం ఉండవల్లి ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సును పూర్తిగా కాగితరహితంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల పాలనాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రెజెంటేషన్లన్నీ ఆన్లైన్ ద్వారానే అందించడం విశేషం. పూర్తి కాగిత రహితంగా జరిగిన సమావేశం రాష్ట్ర చరిత్రలో ఇదేనని అధికారులు ప్రకటించారు. గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా ఈ సమావేశం మొత్తం డిజిటల్ మయంగా నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. ఈ పోర్టల్‌ను సమావేశం ప్రారంభంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఎన్నో ప్రత్యేకతలతో ఈ పోర్టల్‌ను రూపొందించారు. సదస్సులో పాల్గొనే కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రగతి నివేదికలను ఇందులో పొందుపరచారు. ఆన్లైన్ విధానంలోనే ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. లోగడ జరిగిన కలెక్టర్ల సదస్సులకు సంబంధించిన గణాంకాలు, నివేదికలను కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచడం విశేషం. ఆయా సదస్సులు తీసుకున్న నిర్ణయాలు, వాటిపై జిల్లా పాలనాధికారులు తీసుకున్న చర్యలు ఇకపై ఇందులో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అవుతున్నాయనేది సాధారణ ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి అధికారికి సోషల్ మీడియా మొబైల్ అప్లికేషన్ల ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందించారు.
జిల్లా కలెక్టర్ల సమావేశాలలో ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు నివేదికల సమర్పణకు కాగితాల ఖర్చు ప్రతిసారి ఐదారు లక్షల రూపాయలు అయ్యేది. ఈ పర్యాయం ఆ మేరకు వ్యయాన్ని నియంత్రించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్‌టైమ్ గవర్నన్స్ విభాగాన్ని అభినందించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో ఆర్టీజీఎస్ను అమలుచేస్తుండటం గర్వకారణమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం సత్ఫలితాలను సాధించగలుగుతోందని చెప్పారు. ఆర్టీజీకి అనుబంధంగా ఉన్న ‘పరిష్కార వేదిక’ 1100 కాల్ సెంటర్ ద్వారా ప్రజలకు అనుసంధానం అవుతుండటంతో పరిపాలనలో అత్యుత్తమ ఫలితాలను రాబట్టగలుగుతున్నామన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే కాకుండా మరింత నాణ్యమైన సేవలను అందించడానికి ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యమవుతోందని అన్నారు.