మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను, విగ్రహాలను వైఎస్సార్సీపీ నాయకులు పగలగొడుతున్నారు. గత ప్రభుత్వంలో 804 కోట్ల నిధులతో హంద్రీనీవా ద్వారా పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చాం. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కూడా పేరూరుకు వచ్చి డ్యాంలు ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే మంగళవారం కొంత మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక, దివంగత నేత వరిటాల రవీంద్ర, శ్రీరాములయ్య, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలను పగలగొట్టడం జరిగింది. తాము వైఎస్సార్సీ చేసే అభివృద్ధి పనులకు స్వాగతిస్తున్నామని, విగ్రహాలను, శిలాఫలకాలను పగలగొట్టడం పనికిమాలిన చర్య అని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె.పార సారధులు పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని ఎస్పీ బంగ్లా వద్ద ఎస్సీ సత్యయేసుబాబును కలిసి వైఎస్సార్సీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న సంఘటనల పై ఫిర్యాదు చేసి వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం మీడియాతో కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరూరు డ్యాంకు నీరు తీసుకురావాలన్న సంకల్పంతో హంద్రీనీవా ద్వారా 804 కోట్లు నిధులు వెచ్చించి నీటిని తీసుకొచ్చారన్నారు. కొంత మంది వైఎస్సార్సి నాయకులు పరిటాల రవి, చంద్రబాబునాయుడు ఫోటోలను ధ్వంసం చేశారన్నారు. అధికారం శాశ్వతం కాదని ప్రభుత్వాలు వస్తుపోతుంటాయని కక్షలు పెంచరాదన్నారు. గతంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న తాము హెచ్చరించామని అలా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త వికాదన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రామగిరి మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అయితే వైఎస్సార్సి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామగిరి మండలంలోని వైఎస్సార్సి నాయకులు, కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. రామగిరి మండల కేంద్రంలో స్టేడియంను ఏర్పాటు చేశామని, అక్కడ ఆర్చిను ఏర్పాటు చేసివుంటే దానిని పగలగొట్టారన్నారు. అలాగే కొన్ని గ్రామాలోల పరిటాల రవీంద్ర పేర్లను తొలగించడం జరిగిందన్నారు. పేరూరు డ్యాంకు నీరు ఎటునుంచి తెచ్చినా మాకు సంతోషమేనని, తాము ఎవరు అభివృద్ధి చేసినా ఆశీర్వదిస్తామని, కానీ ఇలాంటి పనికిమాలిన పనులకు పాల్పడకూడదన్నారు.