తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్‌సభలో నిరసన తెలుపుతున్నప్పుడు కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. సభలో నూతన సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయడానికి స్పీకర్ పోడియం ముందు ఉంచిన నిలువెత్తు మైక్‌కు ప్లకార్డు తగిలించి ఏలూరు ఎంపీ మాగంటి బాబు పైకెత్తినప్పుడు ఇది చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాలు ఉదయం మొదలైన వెంటనే ఇటీవల కన్నుమూసిన కన్నడ సినీనటుడు, మాజీ ఎంపీ అంబరీష్‌కు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం కర్ణాటకలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో శివమొగ్గ నుంచి గెలిచిన యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రెండు కార్యక్రమాలు అయిన వెంటనే కాంగ్రెస్, ఏఐఏడీఎంకె, తెదేపా సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి తమ డిమాండ్లపై ఆందోళన మొదలుపెట్టారు.
స్పీకర్ స్థానానికి కుడివైపున తెదేపా సభ్యులు ప్లకార్డులు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు, ప్రత్యక హోదా, రైల్వేజోన్‌పై నినాదాలు చేస్తూ నిల్చున్నారు. మాగంటి బాబు తన ముందున్న నిలువెత్తు మైకు కేబుళ్లలోకి తెదేపా ప్లకార్డును జొప్పించి.. దాన్ని పైకి ఎత్తి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇనుప చువ్వతో బలంగా ఉన్న మైక్‌ను పైకి ఎత్తడంతో ఆయన ఏదైనా చేస్తారేమోనన్న ఆందోళన స్పీకర్‌లో మొదలైంది. వెంటనే దాన్ని పక్కనపెట్టాలని గట్టిగా కోరారు. అప్పటికే సభ్యులంతా బిగ్గరగా నినాదాలు చేస్తుండటంతో స్పీకర్ మాటలు మాగంటి బాబుకు వినిపించలేదు.
ఇంతలో పార్లమెంటు వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్ తోమర్..మాగంటి బాబు దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి మైకు కిందపెట్టాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సిబ్బంది ఆయన చేతుల్లోంచి మైకును లాక్కోడానికి ప్రయత్నించినా వదల్లేదు. దీంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట వినకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సభ వాయిదా పడిన వెంటనే స్పీకర్ తెదేపా సభ్యులందర్నీ తన ఛాంబర్‌కు పిలిపించుకొని సున్నితంగా మందలించారు. సభ పునఃప్రారంభమైన వెంటనే వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తున్న పార్టీలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ హితబోధ చేశారు. ఆందోళన కొనసాగించడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.