ఏపీకి సంబంధించిన ప్రధాన సమస్య అమరావతి అంశం పక్కదారి పట్టింది. ఈనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అమరావతి సమస్యను కేంద్ర ప్రభుత్వంతో పాటు, యావత్ భారతదేశానికి పార్లమెంటు సాక్షిగా మరోమారు తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు సిద్ధమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా 33వేల ఎకరాలు భూములిచ్చిన 28వేల మంది రైతులు దాదాపు 275 రోజులుగా చేస్తున్న పోరాటాలు, మరోప్రక్క వైసీపీ ప్రభుత్వం రైతులపై సాగిస్తున్న వేధింపు చర్యలు, శాసనమండలి రద్దు ప్రతిపాదనలు.. వివిధ అంశాల్లో అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరి.. కోర్టుల్లో వరుస మొట్టికాయలను పార్ల మెంటు సాక్షిగా వెలుగులోకి తెచ్చి ఎండగట్టాలని టీడీపీ పార్లమెంటరీ సభ్యులు భేటీలో నిర్ణయించారు. అమరావతి జేఏసీ సైతం పార్లమెంటు సభ్యులందర్నీ కలసి మూడు రాజధానుల పేరుతో అమరావతిని ఖూనీ చేసి రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని నిర్ణయించింది.
కాని ఈ అంశాలేవీ పార్లమెంటులో ప్రస్తావనకు రాకముందే వైసీపీ వ్యూహాత్మకంగా వాటిని పక్కదారి పట్టించేలా అమరావతి రాజధాని పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్, పైబర్ గ్రిడ్ పేరుతో మరో కుంభకోణం జరిగిందని, వీటిపై సీబీఐచే విచారణ జరిపించాలంటూ ఉభయసభల్లో ప్రస్తావనకు తెచ్చింది. వీటితో పాటు గతంలో ఎన్నడూలేని విధంగా న్యాయవ్యవస్థ సైతం పక్షపాతంగా వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుందని, కేంద్రం జోక్యం చేసు కోవాలంటూ వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. వాస్తవానికి ఈ అంశాలపై గురువారం ఉభయసభల్లో మాట్లాడడానికి అవకాశం లేనప్పటికీ వైసీపీ ఎంపీలు వ్యూహాత్మకంగా ప్రస్తావించారు. అలాగే తర్వాత పార్లమెంటు వెలుపల సైతం అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీలు ధర్నా చేశారు. రాజ్యసభలో కరోనా అంశంపై చర్చలో భాగంగా వచ్చిన అవకాశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. ఇలా మొత్తానికి అమరావతి విషయం ప్రస్తావనకు రాకుండా, మూడు ముక్కల రాజధాని గురించి పార్లమెంట్ లో ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు.