పసుపు-కుంకుమ క్రింద శుక్రవారం రాష్ట్రంలోని రాజధాని అమరావతి, రాయలసీమలోని కడప, ఉత్తరాంధ్రలోని విశాఖలలో భారీ ఎత్తున డ్వాక్రా మహిళలతో సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం మొత్తం కలియ తిరిగేలా సీఎం చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటనలతో ఒకేరోజు మూడు సభలకు హాజరుకానుండడం విశేషం. శుక్రవారం రాజధాని అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించే హైకోర్టు భవనం ఎదురుగా లక్షమంది మహిళలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున మహిళలను తరలించేందుకు వెయ్యికిపైగా బస్సులను ఏర్పాటుచేశారు. అదేవిధంగా విశాఖ, కడప, జిల్లాల్లో జరిగే పసుపు-కుంకుమ సభలకు భారీ ఎత్తున మహిళలు హాజరుకానున్నారు.
ఈవారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించగా శుక్రవారం జరిగే సభలో మహిళలకు పసుపుకుంకుమ క్రింద 10 వేల రూపాయలు కానుక ప్రకటించే అవకాశం ఉంది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ఇప్పటికే పసుపు-కుంకుమ పథకం క్రింద నగదు మొత్తాన్ని అందించిన ప్రభుత్వం మరోసారి డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ. 10 వేలు ఇచ్చేందును నిర్ణయించింది. పాత గ్రూప్ సభ్యులకే కాకుండా ఈ మధ్యకాలంలో ఏర్పడిన అన్ని సంఘాలకు, వాటిలోని సభ్యులకు కూడా ఈ నగదు మొత్తాన్ని ఇవ్వనుంది. వచ్చేనెల మొదటివారంలో ఏకకాలంలో చెక్కుల రూపంలో ఈ నగదును అందించి మహిళల మోముల్లో చిరునవ్వులు పుయించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ కానుక రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరిల్లో కలిపి సుమారు 94 లక్షల మందికి లబ్ధిచేకూరనుంది.
డ్వాక్రా గ్రూపులు పసుపు - కుంకుమ పథకం కింద రూ.10000 - వివరాలు: - పసుపు-కుంకుమ తొలి విడత కింద రూ.8,604కోట్లు డ్వాక్రా సంఘాలకు, ఒక్కో మహిళకు రూ.10వేల చొప్పున. - ఈ నాలుగేళ్లలో వడ్డీ రాయితీ కింద రూ.2,514కోట్లు ఇచ్చారు. అంటే ఇప్పటికి మొత్తం రూ.11,118కోట్లు. - 2004-09 లో ఇచ్చింది కేవలం రూ.267కోట్లు. - 2009-14, ఇచ్చింది రూ.2,039కోట్లు మాత్రమే. - ఆ పదేళ్ల కన్నా ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం 5రెట్లు ఎక్కువ ఇచ్చింది - మొన్న ఇచ్చిన వడ్డీ మాఫీ రూ.10వేలు కాకుండా ఇప్పుడు మరో రూ.10వేలు పసుపు-కుంకుమ 93.81లక్షల మంది మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. - అంటే మరో రూ.9,400కోట్లు మహిళలకు ఇస్తున్నారు. - అంటే ఆ వడ్డీ మాఫీ - రూ.10వేలు, ఈ పసుపు కుంకుమ - 10వేలు కలిపి 5 ఏళ్ళల్లో ఒక్కో మహిళకు రూ.20వేలు ఇచ్చినట్లు అన్నమాట. - వడ్డీ మాఫీ కింద ఖర్చు పెట్టింది రూ.11,118కోట్లు, - పసుపు కుంకుమ బహుమతి కింద, రూ.9,400కోట్లు - మొత్తం కలిపి మొత్తం రూ.20,518కోట్లు డ్వాక్రా మహిళలకు ఇంత ఆర్ధికలోటులో కూడా ఇచ్చారు. పసుపు-కుంకుమ కార్యక్రమంతోపాటు పెన్షన్లు పెంపుదల, కాపు రిజర్వేషన్, ఆటో – ట్రాక్టర్ల జీవితకాలం పన్ను ఎత్తివేత, చేనేత కార్మికుల జీవితభీమా తదితర సంక్షేమ కార్యక్రమాలు ఆ వర్గాలలో తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల వాతావరణాన్ని కలుగజేసింది. వీటన్నింటిపై వర్గాలవారీగా భారీ ఎత్తున సభలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం కల్పించి తద్వారా ఓటర్లను ప్రభుత్వంలో ఉన్న అధికారపార్టీ వైపు మళ్ళీంచేందుకు కసరత్తు చేస్తున్నారు.