ఆర్థిక ప్రతిబంధకాలెన్ని ఉన్నా రాష్ట్రప్రభుత్వం వెనకడుగు వేయలేదు. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న పసుపు-కుంకుమ పథకం చివరి విడత నిధులు రూ.1980 కోట్లను విడుదల చేసింది. డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం నుంచి బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు. దీనితో ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేల వంతున ఇస్తామని తెదేపా ఇచ్చిన హామీని ప్రభుత్వం పూర్తిస్థాయిలో నెరవేర్చినట్టయింది. శనివారం విడుదలయిన 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరింది. మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు నెలల వ్యవధిలో మూడు దఫాలుగా రూ.10 వేలు చొప్పున మంజూరు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఈ పథకాన్ని అత్యంత పకడ్బందీగా చేపట్టింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావటంతో ఆయా పథకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుని తొలగించి పెళ్లికానుక, బీమా పేర్లతోనే అమలు చేస్తోంది. పథకాలకు సంబంధించిన హోర్డింగ్‌లు, బోర్డులలో ఉన్న సీఎం ఫొటోలనూ తొలగించింది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన తెదేపా ప్రభుత్వం... వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు మరో రూ.10 వేలు చొప్పున ఇస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ముందే చెక్కులు అందజేసింది. ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలా నిర్వహించింది. ఫిబ్రవరి 1న రూ.2,500, మార్చి 8న రూ.3,500 వంతున డ్వాక్రా మహిళలకు అందజేసింది. మిగతా రూ.4 వేలకు సంబంధించి రూ.3,980 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఇటీవలే రూ.2 వేల కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. మిగతా రూ.1980 కోట్లను శనివారం విడుదల చేసింది. ఈ ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద మొత్తం రూ.18,460 కోట్లు చెల్లించింది. 2014 మార్చి నాటికి స్వయం సహాయక సంఘాల్లో 86 లక్షల మంది సభ్యులుండగా ... పసుపు-కుంకుమ-1లో రూ.8,660 కోట్లు సాయం అందజేసింది. ఈ ఐదేళ్లలో సభ్యుల సంఖ్య 98 లక్షలకు చేరగా... ప్రభుత్వం ఇప్పుడు రూ.9,800 కోట్ల సాయం అందజేసింది.

తెదేపా అధికారంలోకి వచ్చాక ‘కోటి మంది మహిళలు- రూ.లక్ష కోట్ల సాయం’ అన్న నినాదాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సెర్ప్‌ ద్వారా... 98 లక్షల మంది మహిళలకు రూ.20 వేలు చొప్పున పసుపు-కుంకుమ ఇచ్చింది. 54 లక్షల మంది పింఛన్లు అందజేస్తోంది. 2.5 లక్షల మందికి బీమా పథకం కింద రూ.2490 కోట్లు అందజేసింది. పెళ్లి కానుక కింద 90 వేల పేద యువతులకు రూ.325 కోట్ల సాయం అందజేసింది. డ్వాక్రా మహిళలకు రూ.68,800 కోట్ల రుణాలు ఇచ్చింది. రూ.882 కోట్ల ఉన్నతి రుణాలు అందజేసింది. సెర్ప్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్ని 110 శాతం పెంచింది. ఇది వరకు రూ.20 వేలు ఉండే వేతనాలను ప్రస్తుతం రూ.50 వేలు ఇస్తున్నట్టు సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ప్రభుత్వ పథకాల్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం. పేదలు, మహిళలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందజేసేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఎన్నికల నియమావళిని తూ.చ. తప్పక పాటిస్తున్నాం. పథకాల్లోను, బోర్డులపైనా ముఖ్యమంత్రి పేరు తొలగించాం. విపక్ష పార్టీ రాజకీయ దురుద్దేశాలతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దుష్ప్రచారం పట్ల మా సిబ్బంది తీవ్ర వేదనకు గురవుతున్నారు’’ అని ఆ ప్రకటనలో కృష్ణమోహన్‌ పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read