గుంటూరు జిల్లా కొండవీడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతు కోటయ్య మృతి రాజకీయ దుమారం రేపుతోంది. దీంతో ముందస్తుగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా జాగ్రత్త పడ్డారు.. యడ్లపాడు మండలం పుట్టకోటలో కొండవీడు కోట ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్న సమయంలో రైతు కోటయ్య మృతి చెందాడు.. ఆ రైతును కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈఘటనపై బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వమే రైతు ఆత్మహత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి..
రైతు ఆత్మహత్య ఘటనపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేసింది వైసీపీ. కొండవీడులో ఈకమిటీ పర్యటించింది. పుట్టకోటకు వెళ్లిన వైసీపీ నిజనిర్థారణ కమిటీ వాహనాలను గ్రామ శివార్లలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కమిటీ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి గ్రామంలోకి నడుకుంటూ వెళ్లారు.. కోటయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. రైతు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. రైతు మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపించారు వైసీపీ నేతలు.
రైతు మృతిని రాజకీయం చేస్తోందంటూ వైసీపీ తీరుపై మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. కోటయ్య పొలంలో హెలిపాడ్ నిర్మించామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని.. లేదంటే జగన్ రాజకీయాలు వదిలేస్తారా అని ప్రత్తిపాటి సవాల్ విసిరారు. ప్రజల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి నక్కా ఆనందబాబు. రైతు కోటయ్య మృతిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కోటయ్య మృతిపై అధికార-విపక్షాలు వెనక్కు తగ్గడం లేదు. రాజకీయ సవాళ్లు విసురుకుంటున్నాయి. ఈ హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే అని వైసీపీ ఆరోపిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతోంది. అయితే అదే స్థాయిలో అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.