రాష్ట్రంలో రాజకీయం మాంచి హీట్ మీద ఉన్న టైంలో, రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి ఒక మాంచి పోజిటివ్ న్యూస్ వచ్చింది. పోయిన ఏడాది కంటే, మూడు రోజుల ముందే, పట్టిసీమ పరవళ్ళు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని మోటార్లను ఆన్‌చేసి గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే ప్రక్రియను శనివారం సాయంత్రం ప్రాజెక్టు సీఈ వి శ్రీ్ధర్, ఎస్‌ఈ విఎస్ రమేష్‌బాబులు ప్రారంభించారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో ఎత్తిపోతల్లోని నాలుగు మోటార్లను ఆన్‌చేసి 1400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఎత్తిపోతలలోని 2, 6, 11, 16 నెంబర్ల మోటార్లను ఇంజినీరింగ్ అధికారులు ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆన్ చేశారు. శనివారం సాయంత్రం 4.14 గంటలకు ఈ ప్రవాహం మొదలైంది.
ఈ సందర్భంగా సీఈ శ్రీ్ధర్ మాట్లాడుతూ గత సంవత్సరం జూన్ 19న ఎత్తిపోతలలోని మోటార్లను ఆన్‌చేస్తే, ఈ సంవత్సరం మూడు రోజుల ముందుగా మోటార్లను ఆన్ చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. గత సంవత్సరం జూన్ 19నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ 105.8 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని, ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ టీఎంసీల నీటిని తరలించగలమనే ఆశాభావంతో ఉన్నామన్నారు. గోదావరి నదిలో నీటి లభ్యతను బట్టి ఎత్తిపోతల్లోని 20 మోటార్లను అంచెలంచెలుగా ఆన్‌చేసి రోజుకి 8,400 క్యూసెక్కుల గోదావరి నీటిని తరలిస్తామన్నారు.
మోటార్లను ఆన్ చేసిన అనంతరం డెలివరీ పాయింట్ వద్దకు వెళ్లిన సీఈ, ఎస్‌ఈ, తదితర అధికారులు కుడి కాలువలోకి వెళుతున్న గోదావరి నీటికి పూజలు నిర్వహించి, అక్కడున్నవారికి మిఠాయిలు పంచారు. ఎస్‌ఈ రమేష్‌బాబు మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజ్ వద్దనుంచి 35 వేల క్యూసెక్కుల సముద్రపు నీరు సముద్రంలో కలుస్తుందన్నారు. కాలువలకు 8,500 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారని, ఎగువ గోదావరి నదిలో నీటి లభ్యతను బట్టి ఆదివారం ఆరు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉందన్నారు. గోదావరి నదీ నీటి మట్టం ఎత్తిపోతల పథకం వద్ద 14.65 మీటర్లు నమోదైందని ఎస్‌ఈ రమేష్‌బాబు తెలిపారు. వీరి వెంట కుడి కాలువ ఈఈ కె శేషుబాబు, ఇరిగేషన్ ఈఈ ఆదిశేషు తదితరులు ఉన్నారు. మరో మూడు రోజుల్లో, ఈ నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు రానుంది.