కొత్త కారు మార్చినంత ఈజీగా పవన్‌కల్యాణ్ భార్యలను మార్చేస్తాడంటూ వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌కల్యాణ్‌కి అభిమానులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. తమ నాయకుడిపై వ్యక్తిగతంగా జగన్ చేసిన విమర్శలను సహించేదిలేదంటూ ఇప్పుడు ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై జనం ఏమనుకుంటున్నారు? ఈ పర్యవసానం ప్రభావం వల్ల వైసీపీ, జనసేనల మధ్య భవిష్యత్తులో ఇదే వైరం కొనసాగుతుందా? పవన్‌కల్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్న జిల్లాలోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా అజెండా ఉందా? అనేదానిపైనా ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది.
ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మొండిగా పవన్‌పై కామెంట్స్ చేశారని రాజకీయ విశ్లేషకులు, సామాన్య జనంలో చర్చ నడుస్తోంది. ‘విమర్శలు చేసే నాయకుడు సచ్ఛీలుడై ఉంటే వ్యక్తిగత విమర్శలు చేసినా వాటికి ప్రాధాన్యం వస్తుంది. జగన్ గతంలో సీఎం చంద్ర బాబును కాల్చి చంపాలన్నారు. ఉరి తీయాలన్నాడు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ వ్యక్తిగతంలోకి వెళ్లాడు. ప్రత్యేక హోదా అంశంపై చేస్తున్న ఉద్యమం ఇలాంటి వాటివల్ల పక్కదారిపట్టే ప్రమాదం ఉందని జగన్ గ్రహించాలి..’ అని ఓ నేత వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణులలోనూ జగన్ చేసిన కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క, జగన్, పవన్ కలిసి డ్రామా ఆడుతున్నారనే అభిప్రాయాలు కూడా కొంత మంది చెప్పారు.
ఇక సోషల్ మీడియాలో అయితే, రెండు వైపులా యుద్ధమే జరిగింది. జగన్‌కు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జగన్ అక్రమ ఆస్తులు, ఆయన కుటుంబ సభ్యులపైనా వ్యక్తిగత ఆరోపణలూ జోరుగానే చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలకు జనసేన, పవన్ అభిమానులు విమర్శలు చేస్తుంటే... మరికొందరు పవన్‌ని ఇన్నాళ్లకు డైరెక్టుగా విమర్శించిన జగన్ ధైర్యవంతుడంటూ పేర్కొనడమూ చర్చనీయాంశమైంది. పవన్ ప్రకటనతో ఈ వివాదం ముగిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఊరుకునేదిలేదంటూ పవన్ ఫాన్స్ హెచ్చరించారు. ఈ పరిణామాలన్నింటిపైనా ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసి నివేదిక పంపినట్టు సమాచారం. ముఖ్యంగా, ఈ గొడవ పెద్దది అయితే, ఎలా అనే విషయం పైనే ఇంటెలిజెన్స్ ఈ గొడవ పై నిఘా పెట్టింది. అయితే అనూహ్యంగా, ఇరు వైపులా, రెండో రోజుకే ఈ వివాదం ముగించేసారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.