జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అంతరంగాన్ని పార్టీ నేతల ముందుంచారు. పార్టీ కోసం చేస్తున్న కసరత్తును కొంత వరకూ పవన్ బహిర్గతం చేశారు. ఉత్తరాంధ్రలో సుమారు 50 రోజుల పోరాట యాత్ర చేశారు (అందులో 20 రోజులకి పైగా సెలవలు), యాత్ర ముగింపు దశలో విశాఖలోని పార్టీ కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని 46 నుంచి 58 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి మెరుగైన పరిస్థితులు ఉన్నాయనీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ స్థానాలు మనవే అని, ఈ సమావేశంలో పవన్ అన్నారు. వీటిని వంద సీట్లు వరకూ తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? వైసీపీతో కలిసి పోటీ చేస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపధ్యంలో పవన్ తన బలాన్ని ప్రకటించడం గమనార్హం. జగన్ తో పొత్తు ఎలాగూ ఉంటుంది కాబట్టి, ఎక్కువ సీట్లు సాధించుకోవటం కోసం, పవన్ ఇలా తన బలాన్ని ఎక్కువ చేసి చెప్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు.
'2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓటమిని చవిచూసింది. ఆ పార్టీని నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రజారాజ్యం తరపున గెలిచిన వారు చిరంజీవిని వదిలేసి, వారి దారి వారు చూసుకున్నారు. చిరంజీవికి అండగా వారు నీలబడి ఉంటే, 2014 ఎన్నికల్లో అన్నయ్య ముఖ్యమంత్రి అయి ఉండేవారే'నని పవన్ కళ్యాణ్ పార్టీ నేతల వద్ద అన్నారు. నేడో, రేపో తన కుటుంబ సభ్యులందరితో సమావేశం కానున్నట్టు పార్టీ నేతలకు పవన్ చెప్పారు. కుటుంబ సభ్యులంతా ఒకే మాట పై ఉన్నామన్న సంకేతాలు అందరికీ తెలియాలన్న భావనతో ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.
సీట్ల విషయంలో ముందుగా చేపట్టిన సర్వే ప్రకారం మాత్రమే ఇస్తానని, సీట్లు రాని వారు తిరుగుబాటు బావుటా ఎగరేయ్యద్దని ఆయన ముందుగానే హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇక ఉత్త రాంధ్ర జిల్లాల్లో పవన్ నిర్వహించిన సభలకు ఆయన అభిమానులే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్య జనాన్ని ఆకర్షించలేకపోయామన్న భావన పార్టీ నేతలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా పవన్ సభకు మహిళలు రాకపోవడం పై చర్చ జరిగింది. త్వరలోనే నియోజకవర్గాల వారీగా మహిళా సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా 30 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారికి దగ్గరగా పార్టీని తీసుకువెళ్లాలని పవన్, ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.