ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, పెద్దగా రాజకీయాలు గురించి మాట్లాడని పవన్, ఈ రోజు అమెరికా పర్యటనలో తన ఓటమి పై మాట్లాడుతూ, ప్రత్యర్ధుల పై పరోక్ష విమర్శలు చేసారు. అమెరికా వేదికగా జరుగుతున్న తానా వేడుకుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గున్నారు. ఆయనతో పాటు, పార్టీ నేత అయిన నాదెండ్ల మనోహర్ కూడా తానా 22వ మహాసభలకు వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పై, తన ఓటమి పై మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న చాలా విషయాల పై ఇంత మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నా, ఎవరూ పట్టించుకునే వారు కాదని, ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన చెంది, తన గుండెల్లో బాధ చెప్పటానికి, జరుగుతున్న విషయాల పై ప్రశ్నించటానికి జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ పెట్టటానికి సిద్ధమైనప్పుడే, మానసికంగా ఎన్నో ఎదురు దెబ్బలు తినటానికి రెడీ అయ్యానని, ఎన్ని ఇబ్బందులు అయినా సరే పడి పార్టీని ముందుకు తీసుకువెళ్తానని, ప్రశ్నిస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని, ఆ బాధ నుంచి తనకు కోలుకోవటానికి, 15 నిమిషాలే పట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు ఫెయిల్యూర్ పెద్ద షాక్ ఇవ్వదని, చిన్నపటి నుంచి ఫెయిల్ అవుతూనే ఉన్నానని, గొప్ప పాఠాలు ఓటమిలోనే నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజల కోసం, విలువల కోసం నిలబడటానికి అని, స్కాములు చెయ్యటానికి రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళే ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నారు, నాలాగా నిజాలు మాట్లాడే వాడికి ఎందుకు ఇబ్బంది, అంటూ జగన్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు. ఎన్ని, కష్టాలు, ఇబ్బందులు ఉన్నా, అది నాకు బలాన్నే ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఎన్నికలు అయిన తరువాత మొదటి సారి, జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యల పై, వైసీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..