టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ నిర్ణయాల వల్ల విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, మరో సంచలన విషయం బయట పెట్టారు. అన్ని రాష్ట్రాలు తిరస్కరించిన సెకీ టెండర్లను ఏపీ మాత్రమే ఖరారు చేసిందని, ఇందులో మతలబు ఏంటో జగన్ చెప్పాలని పయ్యావుల అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరగలేదని కమిటీలు తేల్చాయని, జగన్ మాత్రం ఏదో అవినీతి జరిగిందని ప్రచారం చేశారని పయ్యావుల అన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల పై ఎన్నో విచారణలు వేసి ఏమీ తేల్చలేకపోయారని పయ్యావుల గుర్తు చేసారు. ఇక పోతే ప్రైవేటు సంస్థల్లో తయారయ్యే విద్యుత్ ను ఏపీలో అందుబాటులో ఉన్న విండ్ ఎనర్జీని నిలిపివేసి ప్రైవేట్ సంస్థల దగ్గర అధిక రేటుకు విద్యుత్ కొన్నారని, పయ్యావుల సంచలన ఆరోపణలు చేసారు. జగన్ తప్పుడు నిర్ణయంతో ప్రజలు అధిక బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని, దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.
జగన్ సన్నిహితులకు పంప్డ్ స్టోరేజ్ విధానంలో ఆస్తులు కట్టబెట్టారని, కేంద్రం ఆదేశాలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పంప్డ్ స్టోరేజ్ ఒప్పందాలు, కేటాయింపులున్నాయిని పయ్యావుల చేసిన ప్రకటనతో, ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కి పడింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతారా? అని పయ్యావుల ప్రశ్నించారు. ప్రజా ఆస్తులు ఏకపక్షంగా మీవాళ్లకు కట్టబెడతారా? అని నిలదీశారు. టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో కట్టబెడతారా?, డబ్బులేమో ప్రజలు చెల్లించాలి.. ఆదాయం మీకు కావాల్సిన వ్యక్తులకా? అంటూ పయ్యావుల విరుచుకు పడ్డారు. విద్యుత్ రంగంలో మేము లేవనెత్తిన ఒక్క అంశంపైనైనా స్పందించారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు జగన్ చెబుతున్నది వాస్తవమైతే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిలదీశారు. మరి దీని పై జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.