జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సైలెంట్ గా, ఎవరికీ తెలియకుండా చేసే అక్రమాలు అన్నీ తనదైన శైలిలో బయట పడుతూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇప్పుడు మరో సంచలనంతో బయటకు వచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం దాచి చేస్తున్న అప్పు, అప్పు పక్కదారి పట్టటం, మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తేవటం, కేంద్రం పెడుతున్న చీవాట్లు, ఇలా అనేక విషయాలు పయ్యావుల కేశవ్ బయటకు తెచ్చిన సంగతి తెలిసిందే. నిన్న పయ్యావుల విద్యుత్ కొనుగోళ్ళలో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టి మరో సంచలనానికి దారి తీసారు. కేవలం 24 గంటల్లోనే రూ.30 వేల కోట్ల ప్రతిపాదనలను, క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరీ ఆమోదించారని, దీని వెనుక ఏమి జరిగిందో చెప్పలని అన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్ళలలో భారీ అక్రమాలు జరిగాయని పయ్యావుల ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు యూనిట్ సోలార్ విద్యుత్ ని రూ.2 కు కొనుగోలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అదానీ సంస్థ రూ.2.90పైసలకు కొన్నారని, ఇంత ఎక్కువ రేటుకి ఎందుకు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. సెప్టెంబర్ 15న సెకీ నుంచి తమకు టెండర్ వేసిన అదానీ సంస్థ రూ.2.49 పైసలకే ఇవ్వాలని లేఖ రాస్తే, ఆ తరువాత రోజే సెప్టెంబర్ 16న క్యాబినెట్ మీట్ పెట్టి ఆమోదించారని పయ్యావుల అన్నారు.
సాయంత్రం ప్రతిపాదన వస్తే, తరువాత రోజు ఉదయమే క్యాబినెట్ ఆమోదం కూడా చేసేసారని, రూ.30 వేల కోట్ల విషయంలో ఇంత ఆఘమేఘాల మీద ఏమి ఆలోచించకుండా, ప్రభుత్వం ఏ ప్రయోజనాలు ఆశించి ఇలా చేసిందో చెప్పాలని పయ్యావుల అన్నారు. ప్రభుత్వం ఇది చాలా తక్కువ రేటు అంటుందని, మరి ఇతర ఏ రాష్ట్రాలు కూడా అదానీ నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. గతంలో చంద్రబాబు గారు విద్యుత్ కొనుగోలు చేస్తే, ఆరోపణలు చేసేని వారి, ఇప్పుడు చేస్తున్న దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. కోర్టుకు కూడా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ఈ సంస్థ రాజస్తాన్ నుంచి మనకు సోలార్ విద్యుత్ ఇస్తుందని అంటున్నారని, అక్కడ నుంచి ఏపి డిస్కంలకు చేరేసరికి తడిసి మోపెడు అవుతుందని, ఈ అంశం పై పూర్తి వాస్తవిక సమాచారం ప్రజల ముందు ఉంచాలని అన్నారు. అయితే పయ్యావుల ఆరోపణల పై స్పందించిన మంత్రి బాలినేని, ఈ ఆరోపణలు కొట్టి పారేసారు, అంతా సక్రమంగా జరుగుతుందని అన్నారు.