రేపల్లె దగ్గర ఉన్న ఆనగాని రంగారావు నగర్ లో ఆనందం తాండవిస్తుంది. నాలుగు తరాల నుంచి నిలువ నీడకు నోచుకోని యానాది కుటుంబాలకు పక్కాగృహ నిర్మాణం పూర్తి కాగా గురువారం గృహప్రవేశ మహోత్సవం జరిగింది. ఎక్కడో మట్టి డొంకల్లో చుట్టూ గుడిసెల్లో భయం భయంగా రోజులు గడుపుతున్న 33 కుటుంబాల గిరిజనులకు నగరం పంచాయతీలోని కాపులపాలెంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవాస ప్రాంతానికి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తండ్రి పేరు మీదగా అనగాని రంగారావు నగర్ అని నామకరణం చేశారు. అంతటితో విడిచి పెట్టకుండా ఎన్టీఆర్ గ్రామీణ హౌసింగ్ స్కీమ్ లో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ 33 పక్కా గృహ నిర్మాణాలకు మంజూరు ఇచ్చారు.
తమంత తాముగా ఇళ్ళు కట్టుకునే స్తోమత లేని గిరిజనులకు విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆరనైజేషన్ స్వచ్చంద సంస్థ బాసటగా నిలిచింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కింద ప్రభుత్వం అందించిన నిధులకు తోడు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిధులు, తమ సొంత నిధులను జోడించి వీఆర్వో సంస్థ ఇళ్లు సముదాయం నిర్మించింది. ఇళ్ళలో నుంచి వచ్చే వ్యర్థ జలాలు నేలమీద కనిపించకుండా ఆండర్ గ్రౌండ్ పైప్లైన్ల ద్వారా బయటకు నడిచే ఏర్పాటు చేశారు. కాలనీలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటల్లోకి వ్యర్థ జలాలు మళ్పించే విధంగా పైప్లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఇళ్ళను గురువారంలబ్దిదారులకు అందచేస్తారు.
గృహ సముదాయ నిర్మాణానికి ముందు పల్లంగా ఉన్న ఇళ్ళ స్థలాలను మెరక చేయడం, రోడ్లకు మట్టితోలటం, ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు నిర్మించటం పనులను షిఫర్డ్ సంస్థ నిర్వహించింది. కాలనీలో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు నిర్మాణం జరిగింది. ఊరిబయట నుంచి అనగాని రంగారావు నగర్లోకి దారితీసే ప్రధాన రహదారిని కూడా సీసీ రోడ్లుగా నిర్మించారు. ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అనగానికి రుణపడి ఉంటామని అంటున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళల్లో గృహప్రవేశాలు జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఒకేసారి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, ఈసారి అంతకు రెండు రెట్లు ఎక్కువగా మూడు లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశా చేపట్టింది.