ఇన్నాళ్ళు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై మాటల దాడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు చేతల్లోకి దిగారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ పై, రాష్ట్ర ప్రభుత్వం ఎదురు దాడి ప్రారంభించింది. కొద్ది సేపటి క్రితం రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్సా సత్యన్నారాయణ, స్పీకర్ కార్యాలయానికి, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద, సభా హక్కుల నోటీసులు ఇచ్చారు. ఈ సభా హక్కుల నోటీసులు పరిశీలించి, స్పీకర్ కార్యాలయం, సభా హక్కుల కింద , నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చే అవకాసం ఉందని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన పెద్దిరెడ్డి, బొత్సా, ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నిమ్మగడ్డ మా దొడ్లో కట్టేసే ఎడ్లు లాంటి వాడు అంటూ పెద్దిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అలాగే బొత్సా కూడా, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖలు నేపధ్యంలో, నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర గవర్నర్ కు ఒక లేఖ రాసారు. ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రులు, బొత్సా , పెద్దిరెడ్డి, వీళ్ళు నలుగురు చేసిన విమర్శలు గురించి, ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలు, సజ్జల చేసిన వ్యాఖ్యలు, విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పై ఫిర్యాదు చేసారు.
వీరు ప్రవర్తిస్తున్న తీరు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం అని, రాజ్యంగబద్ధ సంస్థలను ఈ విధంగా అవమానపరచ కూడదు అని, మీరు కనుక కలుగు చేసుకోపొతే, నేను కోర్టుకు వెళ్ళటం తప్ప మరో గత్యంతరం లేదు అంటూ, నిమ్మగడ్డ , గవర్నర్ కు లేఖ రాసారు. మీరు వాళ్లతో మాట్లాడి, సమస్య కోర్టు వరకు వెళ్ళకుండా చూడాలని, గవర్నర్ ను కోరారు. ఈ నేపధ్యంలోనే తాము చేసిన వ్యాఖ్యల పట్ల, గవర్నర్ కు ఫిర్యాదు చేయటం పట్ల, ఎలక్షన్ కమిషన్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అని, తమ హక్కులకు భంగం కలిస్తున్నారని, అందుకే నిమ్మగడ్డ పై రాష్ట్ర శాసనసభ స్పీకర్ కు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. అయితే ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో, దీన్ని పరిగణలోకి తీసుకుని, స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే రాజ్యాంగ సంస్థ పరిధిలో ఉన్న నిమ్మగడ్డకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వోచ్చా లేదా అనే దాని పై చర్చ జరుగుతుంది. ఇక మరో పక్క సోమవారం ఇప్పటికే కోర్టు ధిక్కరణ పై హైకోర్టులో విచారణకు రానుంది.