ఒకప్పుడు కంచుకోటగా వుండి దాదాపు పదేళ్లుగా పట్టు చిక్కకుండా పోయిన పుంగనూరు నియోజకవర్గంపై టీడీపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఆనవాయితీకి భిన్నంగా ఎన్నికలకు ఆరు నెలల ముందటే అభ్యర్థిని ఎంపిక చేసింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీటైన అభ్యర్థిగా అనీషారెడ్డిని తెరపైకి తెచ్చింది. మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు, పుంగనూరు టీడీపీ సమన్వయకర్త ఎన్.శ్రీనాథరెడ్డి సతీమణి అయిన ఎన్.అనీషారెడ్డి న్యాయశాస్త్రం చదివారు. రాజకీయ కుటుంబానికి కోడలుగా రావడంతో పాటు తొలినుంచీ రాజకీయాలపై ఆమె అవగాహన కలిగి వున్నారు. అభ్యర్థిగా ఖరారు చేసిన రోజు నుంచి విశ్రాంతి లేకుండా భర్త శ్రీనాథరెడ్డితో కలసి నియోజకవర్గంలో అనీషారెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. గ్రామగ్రామానా టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. తనను గెలిపిస్తే పుంగనూరులో ప్రశాంత రాజకీయాలు ఉంటాయని, దౌర్జన్యాలుండవని ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ లేదని వైసీపీ నేతలు అనీషారెడ్డిని వేదిక మీదకు రాకుండా అడ్డుకోవడంతో ఆమె ప్రజలే తనకు ప్రోటోకాల్ అంటూ వేదికల ముందు నేలపై కూర్చుని ప్రసంగించడంతో ప్రజల నుంచి సానుభూతి లభించింది. మరోవైపు మంత్రి అమరనాథరెడ్డితో పాటు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తదితరులు నియోజకవర్గంలో పర్యటించి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇటీవల నియోజకవర్గంలో పారుతున్న హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కూడా టీడీపీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది.
ఇక పెద్దపంజాణి మండలం దాసర్లపల్లెకు చెందిన బి.రామచంద్రయాదవ్‌కు జనసేన పార్టీ టికెట్ ప్రకటించింది. కొంతకాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న రామచంద్రయాదవ్‌కు వైద్యరంగానికి సంబంధించిన పరిశ్రమలు, ఆస్పత్రులు ఉన్నాయి. వైసీపీకి మద్దతుగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఈయన వెంట నడుస్తున్నారు. పుంగనూరు బీజేపీ అభ్యర్థిగా సోమలకు చెందిన గన్నా మదనమోహన్‌బాబును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆర్మీలో రిటైరయ్యాక రాజకీయాలపట్ల ఆసక్తి ఉండడంతో ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఈయన సోమల మండలంలో కొంతమంది యువకులతో కలిసి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. రాష్ట్ర విభజనతో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకులు, క్యాడర్ లేదు.