పెథాయ్ తుపాను ప్రజానీకానికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్’ ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో పక్క, పెథాయ్ తుఫానుతో కోస్తా తీరంలోని జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా తుమ్మలపెంట, హంసలదీవి, బాపట్ల, బోగాపురం, ఉప్పాడలో 50 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది.
ఈదురుగాలుల ధాటికి దివిసీమలో 10 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. అటు నిజాంపట్నం ఓడరేవులో అధికారులు 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని 17 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో దాదాపు 283 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిత్యావసరాలను ప్రభుత్వం మండల కేంద్రాలకు తరలించింది. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా జనరేటర్లు ఏర్పాటు చేసింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై పెథాయ్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది.
పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పెథాయ్ తుపాను ప్రభావంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది అత్యవసర పరిస్థితిగా భావించాలని, తుపాను ప్రభావిత జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించాలని ఆదేశించారు. అలాగే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరుకావాలన్నారు. విపత్తును ఎదుర్కోవడంపై ప్రతిశాఖ ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బాబు తెలిపారు. పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. తుఫాను కారణంగా కూలిన చెట్లను తొలగించాలని...విద్యుత్ స్థంభాలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. సహాయ చర్యలలో పార్టీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.