చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పనపాకం హరిజన వాడలో తెదేపా కార్యకర్తలపై వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సర్వే పేరుతో రాత్రి పూట ఊరికి వచ్చిన వైకాపాకు చెందిన ఛానల్ ప్రతినిధులను పనపాకం హరిజనవాడ గ్రామస్థులు ప్రశ్నించారు. మీడియాకు మద్దతుగా ఉన్న చెవిరెడ్డి అనుచరులు అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి దిగారు. అడ్డొచ్చిన తెదేపా కార్యకర్తలను కర్రలు, దుంగలతో నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ దాడిలో ముగ్గురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. బాధితులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని బాధితులను పరామర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేల పేరుతో వైకాపా రౌడీయిజం మితిమీరిపోతోందని, దీన్ని ఎన్నికల అధికారులు తక్షణమే అడ్డుకోవాలని బాధితులు, తెదేపా నాయకులు కోరారు.
ఇక మరో పక్క, పెదపాడు మండలం పాతముప్పర్రులో వైసీపీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ప్లైయింగ్ స్క్వాడ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని స్క్వాడ్ ఇన్‌ఛార్జి, జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి కేవీ సాయి ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సాఆర్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బాణాసంచా కాల్చుతుండగా, దానిని చిత్రీకరించేందుకు వెళ్లిన ప్లయింగ్ స్క్వాడ్ వీడియోగ్రాఫర్‌ను అడ్డుకుని అతని వద్ద నుంచి వీడియో కెమెరాను తీసుకోవడంతో పాటుగా అధికారుల విధులకు ఆటం కం కలిగించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసాదరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్‌ఐ కె.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.