సాధారణంగా పెద్దలంతా మనం మంచిపనులతో కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని, అలా వచ్చేఖ్యాతీ ఖండాంతరాలు దాటాలని ఆశీర్వదిస్తుంటారని, కానీ రాష్ట్ర నాయకుడైన జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, నిర్వాకాలు, పరిపాలనా విధానాలు, తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, చేస్తున్న దౌర్జన్యాల గురించిన చర్చ ఖండాంతరాల్లో జరుగుతోందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రపంచమంతా ఏపీ వైపు చూసేదని, చంద్రబాబు నాయుడి నిర్ణయాలు, విధానాలపై ఆసక్తి కరమైన చర్చ జరిగేదని, కానీ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. జగన్ అవినీతి వల్ల తాము నష్టపోయామని వివిధ దేశాలు, భారతదేశానికి ఫిర్యాదులు చేస్తున్నాయన్నారు. అమెరికాకు చెందిన వాల్ స్ర్టీట్ జర్నల్ పత్రిక సోలార్ పవర్ ఉత్పత్తిపై 17-02-2020 న ఒక వ్యాసాన్ని ప్రచురించిందని, దానిలో ప్రత్యేకంగా రాష్ట్రం గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో సోలార్ పవర్ కు సంబంధించిన ఒప్పందాలను అక్కడి ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని, సోలార్ పవర్ ఉత్పత్తి చేసే కంపెనీలు, పెట్టుబడుల పెట్టినవారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని చెప్పడం జరిగిందన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై బిజినెస్ లైన్, ఎకనమిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయపత్రికలు దుమ్మెత్తి పోశాయని, తాజాగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వాల్ స్ట్రీట్ జర్నల్ ఏపీని గురించి ప్రస్తావిస్తూ జగన్ చర్యలను తప్పు పట్టిందన్నారు. రాష్ట్రంలో ఎవరూ పెట్టబడులు పెట్టకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చర్యలను సింగపూర్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణకొరియా, జర్మనీ దేశాలు భారతదేశానికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ రాసిన కథనం చూస్తే, పారిశ్రామికవేత్తలెవరూ రాష్ట్రంవైపు కన్నెత్తి చూసేపరిస్థితి కనిపించడం లేదని పట్టాభి ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ తుగ్లక్ చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ట మంటగలిసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారో జగన్ చెప్పాలని పట్టాభి నిలదీశారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఉపాధి సృష్టి, ఉద్యోగాల కల్పన ఎలాసాధ్యమవుతుందో జగన్ చెప్పాలన్నారు. గతంలో ఇదే వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక చంద్రబాబు నాయుడి పనితీరుని, రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంశిస్తూ అనేక కథనాలు ప్రచురించిన విషయాన్ని జగన్ సర్కారు తెలుసుకోవాలన్నారు. గతంలో ఏ రాష్ట్రం గురించైతే వాల్ స్ట్రీట్ జర్నల్ గొప్పగా రాసిందో, ఇప్పుడు అదే పత్రిక అదే రాష్ట్రం గురించి చెడుగా రాయడానికి జగన్ నిర్ణయాలు కారణం కాదా అని పట్టాభి ప్రశ్నించారు. ( ఈసందర్భంగా గతంలో చంద్రబాబునాయుడు పెట్టుబడుల కోసం వాల్ స్ట్రీట్ లో పర్యటించిన వీడియోను పట్టాభి విలేకరులకు ప్రదర్శించారు)

దేశంలో ఏ ముఖ్యమంత్రికూడా ఇంతవరకు కాలినడకన వాల్ స్ట్రీట్ లో పర్యటించలేదని, చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టబడులు తీసుకురావడం కోసం అలుపులేకుండా పర్యటించారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని అత్యంత సమర్థంగా పూర్తిచేసిన బాబర్ కంపెనీకి చెల్లించకపోవడంతో, జర్మనీకి చెందిన సదరు కంపెనీ ఆదేశంలో జగన్ తీరుపై ఫిర్యాదు చేసిందన్నారు. పీపీఏల రద్దు సమయంలో సోలార్ పవర్ ఉత్పత్తిని తప్పుపట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పడు ఏముఖం పెట్టుకొని సోలార్ పవర్ కు సై అంటున్నాడని పట్టాభి నిలదీశారు. అసెంబ్లీలోపల, బయటా సోలార్ విద్యుత్ ఒప్పందాలను తప్పుపట్టని జగన్ కు ఇప్పుడు వాస్తవాలు బోధపడుతున్నట్టున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ కోతలనేవి లేకుండా చేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అప్రకటతి విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాన్నారు. సోలార్ , విండ్ పవర్ ఉత్పత్తిని నిలిపివేస్తే రాష్ట్రం చీకట్లపాలవుతుందని గతంలోనే చంద్రబాబునాయుడు హెచ్చరించినా జగన్ లెక్కచేయలేదన్నారు. జగన్ నిర్ణయాల కారణంగా రాష్ట్రం పరువు గంగపాలై, ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయి కాబట్టే, చంద్రబాబునాయుడు ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారని, రాష్ట్రం నష్టపోతున్న తీరుని ప్రజలకు వివరించడానికే జనం మధ్యకు వెళ్లారని పట్టాభి స్పష్టంచేశారు.

రాష్ట్రాన్ని బాగుచేయడంకోసం చంద్రబాబు కాలినడకన వాల్ స్ట్రీట్ లో పర్యటిస్తే, జగన్ వచ్చాక కియా, ఆదానీ గ్రూప్, రిలయన్స్, లులూ గ్రూప్ లు వెనక్కు వెళ్లాయన్నారు. చంద్రబాబునాయుడి పాలనలో కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి క్యూకడితే, జగన్ పాలనలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. టీడీపీ హాయంలో 5.50లక్షల ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీలో వైసీపీప్రభుత్వమే ప్రకటించిందన్నారు. దావోస్ లో పెట్టుబడిదారులంతా జగన్ తీరుపై కేంద్రానికి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారని, అయినా కూడా ముఖ్యమంత్రి తనపనితీరు మార్చుకోవడం లేదన్నారు. పోలీసులు లేకుండా ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చేయడంలేదని, పోలీస్ పహారాలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వైసీపీనేతలు, ప్రజలమధ్యకు వెళ్లిన చంద్రబాబునాయుడిపై దుష్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. నవమోసాల పాలనవల్ల రాష్ట్రం ఎంతలా నష్టపోయిందో, జగన్ తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాల కారణంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించడానికే టీడీపీ ప్రజాచైతన్య యాత్రను ఆరంభించిదన్నారు. ప్రజలంతా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని, వైసీపీనేతలకు తగినవిధంగా బుద్ధి చెప్పాలని పట్టాభి సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read