ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ అంటూ, ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని పేరిట రుణాలు తీసుకోవటం చట్ట విరుద్ధం అని, ఈ విధంగా రుణాలు ఇవ్వకుండా జాతీయ బ్యాంకులను ఆదేశించాలని, విజయవాడకు చెందిన కె.హిమబిందు వేసిన పిటీషన్ ఈ రోజు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటీషన్ పై, ఈ రోజు పిటీషనర్ తరుపున వాదనలు జరిగాయి. ఈ విధంగా రుణాలు తీసుకోవటం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు వ్యతిరేకం అని, అలాగే జాతీయ బ్యాంకులు కూడా ఈ విధంగా రుణాలు ఇవ్వటానికి, అనుమతి ఇవ్వకూడదని కూడా ఆయన వాదించారు. దీంతో పాటుగా ఇటీవల రాష్ట్రాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి, రుణాలు తీసుకున్నారని, దీని పై ఇది రాజ్యాంగ విరుద్ధం అని,కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి నోటీసులు పంపి, దీని పై వివరణ ఇవ్వాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఈ పిటీషన్ వెంటనే విచారణకు ఆదేశించి, తగు సూచనలు ఇవ్వాలని కూడా పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుని విజ్ఞప్తి చేసారు. ఇదే సమయంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. ఇటువంటి పిటీషన్లకు విచారణ అర్హత లేదని అన్నారు. ఈ కేసులు, నిలబడే కేసులు కావని కూడా ఆయన హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ధికంగా ఇబ్బందులు పాలు చేసేందుకే, వారినికి ఒకటి, ఇలాంటి పిల్స్ వేస్తున్నారని, దీని ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అదే ఈ పిటీషన్ లో కనిపిస్తుందని, ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించ కూడదని, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఎటువంటి విచారణ అర్హత లేదని ఆయన వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఇటువంటి పిటీషన్ లాంటిదే ఇంకొకటి రెండు రోజుల్లో విచారణకు వస్తూ ఉండటంతో, ఈ పిటీషన్ ను కూడా ఆ పిటీషన్ తో కలిపి విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది. అయితే ఆ పిటీషన్ లో ఉన్న అంశాలు, ఈ పిటీషన్ లో ఉన్న అంశాలు వేరని, ఈ పిటీషన్ ని విడిగా విచారించాలని కోరారు. అయితే దీని పై ఆ రోజే విచారణ చేస్తామాని హైకోర్టు చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఒక ప్రత్యెక సంస్థను పెట్టి, మద్యం లాంటి వాటికి, భవిష్యత్తులో వచ్చే ఆదాయాలు చూపి, అప్పు తెచ్చుకుని, రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్న అంశం పై, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.