ఎన్నికల ఫలితాలు తరువాత దాదపుగా కనుమరుగు అయిన పవన్ కళ్యాణ్, గత రెండు మూడు రోజుల నుంచి, తన పార్టీ వ్యవహారాల్లో బిజీ అవుతున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నా, పవన్ మాత్రం, జగన్ మోహన్ రెడ్డికి టైం ఇస్తాను అంటున్నారు. నిన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ పాల్గుని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొన్ని జాతీయ పార్టీలు తన వద్దకు వచ్చాయని, తముతో కలిసి పని చెయ్యాలని కోరుతున్నాయని అన్నారు. వారితో కలిసినా, లౌకిక పంథాను వదలనని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే కాదు, తాను జగనసేన పార్టీని విలువలు కోసం పెట్టానని, ఆ పార్టీని వేరే పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని అన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పై, విశ్లేషణలు మొదలయ్యాయి.
పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పని చెయ్యటానికి సిద్ధమవుతున్నట్టు ఆయన మాటలు చూస్తూ అర్ధమవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో అనే పిలుపు ఇచ్చారు. బీజేపీ పై ఎప్పుడూ సానుకూలంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు విమర్శలు చేసినా, మోడీ, అమిత్ షా పేరు కూడా ఎత్తకుండా, పవన్ రాజకీయం నడిపారు. చాలా సందర్భాల్లో తనకు మోడీ ఎంతో ఇష్టమైన నాయకుడు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతే కాదు పవన్ పనిగట్టుకుని, నేను ఎవరితో కలసినా, లౌకికవాదం వీడను అంటే, దాని అర్ధం ఆయన బీజేపీతో కలిసి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నారని అర్ధమవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మొనోహర్, చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే.
చిరంజీవి, బీజేపీలో చేరతారని, ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో, పవన్ కళ్యాణ్, చిరంజీవిని కలవటం, ఆ తరువాత, నేను జాతీయ పార్టీతో కలిసి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పటం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రయాణం చెయ్యటం, ఖాయంగా కనిపిస్తుంది. అయితే, పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ప్రధాన ఎజెండాగా, ప్రత్యెక హోదా పెట్టుకున్నారు. తన వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని చెప్పుకునే వారు. మరి ఇప్పుడు బీజేపీ, అసలు హోదా లేదు అని తేల్చి చెప్పింది. అలాంటిది, పవన్ ఆ పార్టీలోకి ఎలా వెళ్తారు అనే వాదన కూడా వినిపిస్తుంది. మరో పక్క, కొన్ని రోజుల క్రిందట పవన్ మాట్లాడుతూ, ప్రత్యెక హోదా పై జనాల్లో అసలు ఏమి లేదని, తాను ఒక్కడినే పోరాటం చేస్తే ఏమి లాభం అని చెప్పిన విషయాలు ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అంటే పవన్ , బీజేపీతో కలిసి వెళ్ళే ఆలోచన ఉంది కాబట్టే, మొన్నటి దాక, తానె ప్రత్యేక హోదా ప్రతినిధిని అని చెప్పుకున్న పవన్, ఇప్పుడు మాత్రం, హోదా సెంటిమెంట్ ప్రజల్లో లేదు అని చెప్పేసారు. ఏది ఏమైనా, మన రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు చూడబోతున్నాం.