ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పై, జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా మంత్రి బొత్సా సత్యన్నారాయణ ప్రతి రోజు చేసే వ్యాఖ్యలు, అమరావతి ఉంటుందా, ఉండదా అనే చర్చకు దారి తీసింది. ఒక మంత్రి ఇక్కడే ఉంటుంది అంటారు, ఇంకో మంత్రి నిపుణుల కమిటి వేసాం, వారు ఎక్కడ అంటే అక్కడే అంటారు, ఇంకో ఎమ్మెల్యే ఇంకా ఏదో అంటారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు రాజధాని పై ప్రకటనలు చేస్తున్నా, ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి మాత్రం, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అమరావతి పై మాట్లాడటం లేదు. అమరావతికి రుణం ఇవ్వం అని ప్రపంచ బ్యాంకు వెళ్ళిపోవటం, అమరావతిలో 40 వేల మంది కార్మికులు వెళ్ళిపోవటం, తాజాగా కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఇండియా మ్యాప్ లో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించకపోవటం, ఇంత పెద్ద తప్పు జరిగినా, ప్రభుత్వం కేంద్రాన్ని అడగపోవటం చూస్తుంటే, అమరావతి పై ఇప్పటికీ జగన్ మనసులో ఏముందో క్లారిటీ రావటం లేదు.
అయితే, రాజధాని పై ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, ప్రభుత్వం స్పందించటం లేదు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం పై స్పందిస్తూ, ప్రభుత్వం పై విమర్శలు చేసారు. జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తీసుకెళ్ళి పులివెందులలో పెట్టుకోండి అంటూ వ్యంగ్యంగా స్పందించారు పవన్. అంతే కాదు, అమరావతిలో ఉన్న హైకోర్ట్ తీసుకువెళ్ళి, కర్నూల్ లో పెట్టుకుంటే, ఇంకా సుఖంగా ఉంటుందని, జగన్ గారు పులివెందుల నుంచి, కర్నూల్ కోర్ట్ కు ప్రతి వారం వెళ్ళటానికి చాలా ఈజీగా ఉంటుందని, అందుకే పులివెందులలో రాజధాని, కర్నూల్ లో హైకోర్ట్ పెట్టుకోవాలని, పవన్ కళ్యాణ్, జగన్ ప్రభుత్వానికి సూచించారు.
అలాగే బొత్సా పై కూడా వ్యాఖ్యలు చేస్తూ, రాజధాని ఎంపిక చేసే అవకాశం వస్తే మంత్రి బొత్స సత్యన్నారాయణ, అమరావతి నుంచి రాజధాని తీసుకు వెళ్లి, చీపురుపల్లిని రాజధానిగా చేసుకుంటారని, ఇన్నాళ్ళు వీళ్ళు మంత్రులుగా ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 33 వేల ఎకారాలు రైతుల త్యాగం అమరావతి అని, అమరావతిని అక్కడే ఉంచి అభివ్రుద్ధి చెయ్యాలని, పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వంలో అమరావతిలో ఏమైనా కుంబకోణాలు జరిగి ఉంటే, వాటి పై విచారణ జరిపి, అప్పటి ప్రభుత్వ పెద్దల పై చర్యలు తీసుకోవాలి కాని, ఇలా అసలు అమరావతినే ఇక్కడ ఉంచం అని రోజుకి ఒక్క మాట చెప్పటం, ప్రజలను గందరగోళానికి గురి చెయ్యటం, కరెక్ట్ కాదని, పవన్ కళ్యాణ్ అన్నారు.