జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఈ రోజు అమరావతిలో పర్యటించారు. రాజధాని ఇక్కడ నుంచి తరలించ వద్దు అని ఆందోళన చేస్తున్న రైతుల నిరసనకు మద్దతు పలికారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు అడుగడుగునా పోలీసులు అడ్డు చెప్పారు. జగన్ కాన్వాయ వెళ్తుందని, అరగంట ఆగాలని కోరారు. అరగంట అయినా పోలీసులు పర్మిషన్ ఇవ్వక పోవటంతో, పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ, వెళ్లారు. ఈ సందర్భంగా, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్బంగా పవన్ మందడంలో పర్యటించారు. అక్కడ రాజధాని రైతులని ఉద్దేశిస్తూ పవన్ మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటామని, ఇక్కడ నుంచి రాజధానిని మార్చే ప్రసక్తే లేదని అన్నారు. రైతులను పోలీసులు ఇబ్బంది పెట్టవద్దని, వారి పై కేసులు పెట్టి బెబిరించ వద్దని, పవన్ అన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, రైతులు ఎవరికీ భయ పడరని, వారి ఉద్యమాన్ని అణిచి వేయలేరని, ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి పవన్ అన్నారు.
ఒక ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారని, ఇక్కడ రాజధానికి ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసారనే విషయం, జగన్ మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు. రాజధాని ఇక్కడే పెట్టాలని, అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసారని, ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారని, రాజ్యాంగానికి అందరూ కట్టుబడి ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ముందు కనుక జగన్ మోహన్ రెడ్డి, తాను ఇక్కడ నుంచి రాజధాని మారుస్తా అని చెప్తే, ఇప్పుడు జగన్ వాదనకు బలం ఉండేదని, రాజధాని మార్చాలి అంటే, ఏకాభిప్రాయం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం మారిన ప్రతి సారి, వచ్చే ప్రతి ముఖ్యమంత్రి, రాజధాని మారుస్తూ వెళ్తారా అని పవన్ కళ్యాణ్ అన్నారు.
151 సీట్లు ఉన్నాయని విర్రవీగకండి, ఎప్పుడైనా మీ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతును కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాలు నిలబడిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యకం చేసారు. అమరావతిలో కూడా వైసీపీని గెలిపించారని, కాని ఇక్కడ వైసీపీ నేతలు, అమరావతి ప్రజలు రోడ్డున పడితే, వీరిని పైడ్ ఆర్టిస్ట్ లు అంటున్నారని, పవన్ అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, పబ్బం గడుపుకుంటున్నారని, అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలను కూడా రెచ్చగొడుతున్నారని అన్నారు. తమ రాజధాని కోసం, తమ భూముల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని, వారిని అడ్డుకోవద్దని పవన్ పోలీసులుని కోరారు.