జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిరునామా త్వరలోనే, అమరావతి కానుంది. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ సమీపంలో నూతన నివాసానికి పవన్ కల్యాణ్ సోమవారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తున్న ఆయన ఇక నుంచి అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగించనున్నారు. సతీసమేతంగా భూమి పూజలో పాల్గొన్న పవన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు...
ఇటీవల జగన్ చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో జనసేన అంతర్భాగమని, ఆ పార్టీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని, ఆయన ఆదేశాలతోనే జనసేన పనిచేస్తోందని జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, "జనసేనకు చంద్రబాబు అయితే వైసీపీకి మోదీ, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం చేస్తున్నారు అనుకోవాలా?" అంటూ జగన్ కు పంచ్ వేసారు. ఒక విమర్శ చేయడం ఎంతో సులభమని, దానికన్నా ముందు నిజానిజాలను తెలుసుకోవాలని హితవు పలికిన ఆయన, రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. సాధ్యమైనంత త్వరలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించి, ఇక్కడకు మారిపోతానని పవన్ స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. అందుకే హైదరాబాద్ నుంచి కాకుండా సొంత రాష్ట్రం నుంచే తన కార్యక్రమాలు సాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను కూడా గుంటూరులో నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం మంగళగిరి సమీపంలో స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఇప్పుడు శాశ్వత నివాసాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోనున్నారు. అమరావతికి దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్, ఏవైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.