‘‘కేసీఆర్.. మీకో నమస్కారం. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రులను తిట్టారు. ఇవాళ విడిపోయాం. ఇక ఆంధ్రులను వదిలేయండి. శిష్టా ఆంజనేయ శాస్త్రి చెప్పినట్టు రాజ్యాంగబద్ధ విరోధం ఉండాలి. ప్రజల మధ్య విరోధం కాదు’’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘కేసీఆర్... మీరు ఉద్యమానికి నాయకత్వం వహించారు. తక్కువ హింసతోనే రాష్ట్రాన్ని సాధించారు. మీపై గౌరవం ఉంది. మీ గొడవల వల్ల ప్రజలను శిక్షించకండి’ అని విజ్ఞప్తి చేశారు. 1996లో బీజేపీ ‘ఒక ఓటు, రెండు రాష్ట్రాలు’ అనే తీర్మానం చేసి తెలుగు ప్రజలను రెండు ముక్కలు చేసిందన్నారు. ఆ బాధ, కన్నీళ్లు ఉన్నప్పటికీ... మోదీ ప్రధాని కావాలని తాను కోరుకున్నానని తెలిపారు. ‘మీరు ప్రధానైతే మంచి రోజులొస్తాయనుకున్నాం. కానీ.. ఏవీ? పార్లమెంటుసాక్షిగా హామీ ఇచ్చిన, మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదు? భయపెట్టి పాలిస్తానంటే భయపడతామా? మేమేం తప్పు చేశాం. ఆంధ్రులు ఈదేశ పౌరులు కారా? పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టడంలేదు? చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనా, మీరూ చూసుకోండి! ఆ కోపం ఆంధ్రాపై ఎందుకు చూపిస్తారు!’ అని పవన్ నిలదీశారు. రాష్ట్రాన్ని ఒకసారి కాంగ్రెస్ దెబ్బకొట్టిందని... ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోందని ధ్వజమెత్తారు.
జగన్...తండ్రి మాటపై గౌరవం లేదా! రాష్ట్రాన్ని గట్టి దెబ్బకొట్టిన బీజేపీ.. వైసీపీకి దొడ్డి దారిన అండగా ఉందని పవన్ విమర్శించారు. ‘జగన్ దీనికి బదులివ్వాలి. బీజేపీతో ఎందుకు కలిశారో స్పష్టత ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. బీజేపీతోపాటు టీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్‌లతో తనకు జగన్‌కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉందని.. అయితే, రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికి వాళ్లతో విభేదించానని తెలిపారు. ‘తెలంగాణ విడిపోతే ఏమవుతుందో వైఎస్ చెప్పారు. ఆయన కొడుకుగా జగన్ ఆ మాటలు మరిచిపోయారు. తండ్రి మాటపై గౌరవం అదేనా!’ అని పవన్ ప్రశ్నించారు.‘చంద్రబాబు పోటీ చేయొచ్చు. జగన్ పోటీ చేయొచ్చు. కానీ.. కేసీఆర్‌ను ఎందుకు తెస్తారు? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన వ్యక్తులకు అండగా ఉండడం మంచిది కాదు. బీజేపీ, కేసీఆర్‌తో మీకెందుకు? వాళ్లతో కలసి ఉన్న నేనే విభేదించాను. మీరు బయటకు రాకుండా ఆంధ్రుల ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడగలరా?’ అని జగన్‌ను ప్రశ్నించారు. ధర్మకర్తలా ఉండాల్సిన సీఎం.. అవినీతికి కొమ్ము కాస్తుంటే బాధ కలిగిందని తెలిపారు. ‘కొందరు జనసేనకు కేవలం గోదావరి జిల్లాలే బలం అన్నారు. నన్ను కాపులా చూస్తున్నారా? నాకు కులం లేదు. శ్రీకాకుళం నాది, విశాఖ నాది, బొబ్బిలి నాది, కోస్తా నాది, రాయల సీమ నాది!’ అని పవన్ ప్రకటించారు. సినిమాల్లో తొడగొట్టడం వేరు, నిజజీవితం వేరన్నారు.
వైసీపీ నేత జగన్‌లా బీసీల పేరిట సదస్సు పెట్టి ప్రజలను విభజించనని పవన్ తెలిపారు. ‘32 మందితో విడుదల చేసిన జనసేన తొలి జాబితాలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాను. జగన్ కడప ఎంపీ సీటును బీసీలకు ఇవ్వగలరా? పులివెందుల సీటును బీసీలకు ఇవ్వగలరా? మీ వాళ్లను కాదని మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? వ్యక్తులు, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా మీరు సీట్లు ఇవ్వగలరా’ అని పవన్ ప్రశ్నించారు. అందరూ కులాలను విభజించి రాజకీయం చేస్తుంటే తాను ఏకం చేసి రాజకీయం చేస్తున్నానన్నారు. ‘తెలంగాణ నేతలు ఉద్యమ సమయంలో కాపు, కమ్మ, మాల, మాదిగ అని తిట్టలేదు. మొత్తం ఆంధ్రావాళ్లని చెత్త తిట్లు తిట్టారు. అంబేద్కర్ కోరుకున్నట్లుగా కుల నిర్మూలన జరుగుతుందో లేదో... కానీ నేను కులాల మధ్య ఐక్యత సాధిస్తాను’ అని పవన్ స్పష్టం చేశారు. ‘రెడ్డి’ అంటే కులం కాదని, ధర్మాన్ని రక్షించే వాడని అర్థమని నిర్వచించారు. ‘ఈ పదాన్ని బ్రిటిష్ వాళ్లు ఇచ్చారు. నాయుడు, రెడ్డి అనే పదాలు అన్ని కులాల్లోను ఉంటాయి’ అని తెలిపారు.